ఓడీచెరువు: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. ఓడీ చెరువు మండలగం తంగేడుకుంట గ్రామానికి చెందిన తుంగ నవీన్(26) సోమవారం సాయంత్రం అరకబావిపల్లి వద్ద ఎరువు తోలడానికి ట్రాక్టర్‌తో వెళ్లాడు. ఆ సమయంలో దిబ్బలో ఉన్న విద్యుత్ స్తంభం స్టే వైర్ తగిలి షాక్ గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను స్థానికులు వెంటనే ఓడీచెరువులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. కాగా, కూలి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచిన నవీన్ మృతితో కుటుంబ సభ్యులు ఆవేదనకు అంతు లేకుండా పోయింది.
బంగారు నగల అపహరణ
రొళ్ల: మండలంలోని కె.గొల్లహట్టి గ్రామానికి చెందిన మూడ్లప్ప ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి 60 గ్రాముల రెండు బంగారు గొలుసులతో పాటు రూ.10 వేలు నగదు అపహరించారు. బాధితుడు తెలిపిన మేరకు.. ఆదివారం మూడ్లప్ప ఇంటికి తాళం వేయకుండా పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి వద్ద ఉన్న తల్లి తలుపులు దగ్గరగా లాగి పక్కింటికి చేరుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండిపోయింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళం తీసి అందులో భద్ర పరిచిన రెండు బంగారు గొలుసులు, రూ.10 వేలు నగదు అపహరించికెళ్లారు. రాత్రికి ఇంటికి చేరుకున్న మూడ్లప్ప బీరువా తలుపులు తీసి ఉండడం గమనించి పరిశీలించాడు. అందులో బంగారు నగలు, నగదు కనిపించకపోవడంతో సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. క్లూస్‌టీంను రంగంలో దించి నిందితుల వేలిముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పరిష్కార వేదికకు 81 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 81 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సీఐ బొజ్జప్ప, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
కగ్గళ్లు భూ వివాదంపై నేడు ఎస్సీ కమిషన్ విచారణ
హిందూపురం: మండలంలోని కగ్గళ్లు గ్రామంలో భూమి ఆక్రమణపై అందిన ఫిర్యాదుపై మంగళవారం ఎస్సీ కమిషన్ క్షేత్ర స్థాయి విచారణను చేపట్టనుంది. సర్వే నెం:105/2బి, 106–4డిలో భూములు ఆక్రమణకు గురయ్యాయని కగ్గళ్లు గ్రామానికి చెందిన వై. హనుమంతరాయుడు ఫిర్యాదు చేశాడు. దీంతో కమిషన్ సభ్యులు మేకల భిక్షం, ఎన్.టి.రామాంజినమ్మ మంగళవారం ఉదయం హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం కగ్గళ్లులో పర్యటించి వివాదాస్పద భూములను పరిశీలించి వివరాలను ఆరా తీయనున్నారు.


