పెనుకొండ రూరల్: టమాట పైరు కోసం వచ్చిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ అంజయ్య(45) తన పొలంలో టమాట సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దున ఉన్న నర్సరీల్లో టమాట పైరు కొనుగోలు కోసమని సమీప బంధువు శ్రీకాంత్‌తో కలసి కారులో ఆదివారం రాత్రి బయలుదేరాడు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ శ్రీనివాసులు నియంత్రణ కోల్పోవడంతో లారీ కిందకు దూసుకెళ్లాడు. ఘటనలో శ్రీనివాసులు పాటు అతని పక్కనే ముందు సీటులో కూర్చొని ఉన్న అంజయ్యకూ తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న కియా పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆగమేఘాలపై పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అంజయ్య మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులుకు ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. వెనుక సీటులో కూర్చొని ఉన్న శ్రీకాంత్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణలోని సంతాపూర్ ఉప సర్పంచ్ దుర్మరణం
మరొకరి పరిస్థితి విషమం


