పుట్టపర్తి టౌన్: రంజాన్‌ను పురస్కరించుకుని ఎనుములపల్లి గణేష్ కూడలి సమీపంలోని డాక్టర్ అబ్దుల్ కలాం షాదీమహల్‌లో ప్రభుత్వం తరుఫున ముస్లింలకు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రంజాన్ క్రమశిక్షణకు, దాతృత్వానికి నిలువుటద్దమన్నారు. కఠిన ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రంజాన్‌తో పాటు హిందువులు ఘనంగా జరుపుకునే ఉగాది పండుగ ఒకేసారి వస్తున్నాయని, అందరూ కలసి మెలసి శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకుందామన్నారు.
భూగర్భ జలాలు పెంచుదాం
కదిరి అర్బన్: జిల్లాలో అన్ని చెరువులను హంద్రీనీవా నీటితో నింపి భూగర్భ జలాలను పెంచుదామని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కదిరి మండల పరిధిలోని యర్రదొడ్డి సమీపంలో ‘మన పల్లె – మన నీరు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చెరువులను హంద్రీనీవా నీటితో నింపితే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. భూగర్భ జలాలు ప్రస్తుతం 14 మీటర్లలో ఉన్నాయన్నారు. చాలా వరకు చెరువుల సప్లయ్ ఛానళ్లు మెయిన్‌టెయిన్ చేయకపోడంతో పాడయ్యాయని చెప్పారు. 90 రోజుల పాటు కాలువల పూడికతీత కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మతో పాటు స్వచ్ఛాంద్ర కమిషన్ డైరెక్టర్ పర్విన్‌భాను పలువురు అధికారులు పాల్గొన్నారు.
నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు
అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో రిటైల్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ కోర్సులో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారని, శిక్షణ అనంతరం వందశాతం ఉద్యోగ సహకారం అందిస్తామన్నారు. మార్చి 23 నుంచి నూతన బ్యాచ్‌ను ప్రారంభిస్తామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7780752418 ను సంప్రదించాలన్నారు.
అగ్నికి ఆహుతైన
మామిడి చెట్లు
పుట్టపర్తి: గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టడంతో బుక్కపట్నం సమీపంలోని రైతులకు చెందిన మామిడి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం బుక్కపట్నం గ్రామానికి చెందిన అవుటాల రవీంద్రరెడ్డికి చెందిన వంద మామిడి చెట్లు కాలిపోగా, పక్కనే ఉన్న మరో రైతు చెన్నకృష్ణకు చెందిన 25 చెట్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. కాపుకు వచ్చిన చెట్లు కాలి పోవడంతో లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండలకు నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ దిమ్మె తగిలి వ్యక్తి మృతి
హిందూపురం: హిందూపురం కిరికెర పంచాయతీలోని బసనపల్లిలో ఆదివారం శివాలయానికి విద్యుత్ కనెక్షన్ సరిచేస్తుండగా జారిపడి జయచంద్రారెడ్డి (58) మృతి చెందారు. మృతుడు ఆలయంలో సేవలు అందిస్తూ గ్రామస్తులకు అవసరమైన సహాయం చేస్తుండేవాడని స్థానికులు తెలిపారు. ఆలయానికి అవసరమైన విద్యుత్ లైట్లు అమర్చడం కోసం కనెక్షన్లు చేస్తున్నారని, చిన్న దిమ్మైపె ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కనెక్షన్ ఇచ్చి దిగుతున్న సమయంలో జారీ పడటంతో తలకు దిమ్మెకట్ట తగిలిందన్నారు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. ఆయనకు భార్య ఇందిరమ్మతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రూరల్ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


