పదికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పదికి పకడ్బందీ ఏర్పాట్లు

Mar 15 2026 1:01 AM | Updated on Mar 15 2026 1:01 AM

పుట్టపర్తి: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకూ రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 22,303 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. వీరి కోసం 107 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 1,177 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇందులో 971 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, 206 మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు. ఆరుగురు రూట్‌ ఆఫీసర్లు, 107 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 107 మంది డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, ఏడుగురు ఏడీఓలను నియమించారు.

పెరిగిన విద్యార్థుల సంఖ్య..

గత రెండేళ్లతో పోల్చితే ఈసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2024లో 18,419 మంది పరీక్షరాయగా... 2025లో 15,769 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి ఏకంగా 22,303 మంది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో రెగ్యులర్‌ విద్యార్థులు 21,334 మంది ఉండగా.. కంపార్ట్‌మెంట్‌కు సంబంధించి 969 మంది విద్యార్థులున్నారు. రెగ్యులర్‌ సంబంధించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 9,700 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 6,751 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అలాగే కేజీబీవీల నుంచి 1,162 మంది, మున్సిపల్‌ స్కూళ్ల నుంచి 1,529 మంది , ఇతర పాఠశాలల నుంచి 2,192 మంది పరీక్ష రాస్తున్నారు. ఇందులో బాలికలు 10,236 మంది ఉండగా... బాలురు 11,098 మంది ఉన్నారు.

పక్కాగా నిర్వహణ..

పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. సీఎస్‌, డీఓలు ఉదయం 8.30 గంటల్లోపు పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్లాలి. ప్రభుత్వం పేపర్‌ కోడ్‌ తెలియజేయగానే... సదరు కోడ్‌ ఉన్న ప్రశ్నపత్రాలను 9,15 గంటలకు తీసుకుని పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష పూర్తి కాగానే ఆన్సర్‌ షీట్లను పోస్టాఫీసులో డిపాజిట్‌ చేయాలి.

విద్యార్థులకు ఉచిత ప్రయాణం..

పుట్టపర్తి టౌన్‌: పది విద్యార్థులకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు డీపీటీఓ మధుసూదన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు ముగిసే వరకూ ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.

పుట్టపర్తి అర్బన్‌: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. శనివారం సాయంత్రం కొత్తచెరువులోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా నుంచి 456 పాఠశాలలకు చెందిన 22,303 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు హాజరవుతున్నారని, వీరికోసం 107 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాల వద్ద తాగునీరు, నిరంతర విద్యుత్‌, వైద్య సదుపాయం కల్పించామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 1,177 మంది ఇన్విజిలేటర్లు నియమించామన్నారు. అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్నారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా 9 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 40 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం 8328028353 నంబరుతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

ఉదయం 9.30 నుంచి

12.45 గంటల వరకు..

జిల్లా వ్యాప్తంగా 107 కేంద్రాల ఏర్పాటు

హాజరుకానున్న 22,303 మంది విద్యార్థులు

హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో

ఉచిత ప్రయాణం

అరగంట ముందుగానే కేంద్రాలకు

చేరుకోలని డీఈఓ సూచన

పకడ్బందీ ఏర్పాట్లు: డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement