అపు‘రూపం’... పాదరస శివలింగం
రాయదుర్గంటౌన్: శివలింగం అంటే తెలియని వారు, చూడని వారు ఉండరు. అయితే పాదరస శివలింగాన్ని చూశారా అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే పాదరసాన్ని ఘనరూపంలో చూడలేం కాబట్టి!. అయితే ఇలాంటి అపు‘రూప’మైన శింగలింగాన్ని రాయదుర్గం పట్టణంలోని శ్రీరాజ విద్యాశ్రమంలో చూడవచ్చు. దేశంలోనే ప్రథమంగా 1974లో అప్పటి ఆశ్రమ పీఠాధిపతి జీవన్ముక్తస్వాములు, జడసిద్దేశ్వర సరస్వతీ స్వాముల వారు రాయదుర్గంలో పాదరస శివలింగాన్ని ప్రతిష్టించారు. జీవన్ముక్తస్వామి రసవాదుల్ని పిలిపించి రెండు నెలలు అహర్నిశలు కృషి చేసి రుద్రమంత్ర జపాలతో ఏడు కిలోల పాదరసాన్ని మూలికాదులతో ఘనీభవింప చేసి లింగాకృతినిచ్చారు. ఈ శివలింగం 14 సెంటీమీటర్ల ఎత్తు, 25 సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. పాణిపటాన్ని మాత్రం నల్లరాతితో కర్ణాటకలోని రాణిబెన్నూరులో తయారు చేయించి ప్రతిష్టించారు. ఆదివారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహా శివరాత్రి రోజు శివలింగాన్ని తాకే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తారు


