రైతన్నా.. బహుపరాక్!
ధర్మవరం రూరల్: వేసవి కాలం సమీపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఉన్న పచ్చిక అంతా ఎండిపోతోంది. ఇలాంటి సమయంలో ఆకతాయిలు, మందుబాబులు ఎండు గట్టికి నిప్పు పెడుతుండడంతో సమీపంలోని పండ్ల తోటలకు మంటలు వ్యాపించి తోటలన్నీ బుగ్గిపాలవుతున్నాయి. ధర్మవరం వ్యవసాయ డివిజన్‌లో 30 వేల ఎకరాల్లో అటవీ విస్తీర్ణం ఉంది. ముఖ్యంగా ధర్మవరం మండలంలోని దర్శనమల, నడిమ గడ్డపల్లి, బుడ్డారెడ్డిపల్లి, నేలకోట, మల్లాకాలువ, వెంకటతిమ్మాపురం, కనంపల్లి తదితర గ్రామాలు కొండ ప్రాంతాల్లో ఉన్నాయి.
మందుబాబులతో చేటు..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత మద్యం అమ్మకాలు ఎక్కువ కావడంతో మందుబాబులు ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పొలాలకు సమీపంలో పూటుగా తాగుతున్నారు. సిగరెట్లు తాగుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ సిగరెట్ ముక్కలను పడేస్తున్నారు. ఈ క్రమంలో ఎండు గడ్డికి నిప్పు అంటుకుని మంటలు ఎగిసి సమీపంలోని పండ్ల తోటలకు వ్యాపిస్తున్నాయి. మందుబాబుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే నియోజకవర్గంలో పలుచోట్ల చీనీ, బొప్పాయి, మామిడి, అరటి, జామ తదితర తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. పొలాల్లో ఉన్న డ్రిప్పు, ప్లాస్టిక్ పైపులు, వ్యవసాయ పరికరాలు కూడా కాలిపోతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో విస్తరించిన అటవీ ప్రాంతంలో అడవి పందులు, జింకలు, నెమళ్లు, అలవలు, కుందేళ్లు ఎక్కువగా ఉన్నాయి. మందుబాబుల నిర్లక్ష్యం కారణంగా అటవీ సంపద కాలిపోవడమే కాకుండా మూగజీవాల ప్రాణాలు సైతం గాల్లో కలిపోతుండడం అందరినీ కలవరపెడుతోంది. ఈ క్రమంలో వేసవి పూర్తయ్యే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొలం గట్ల వెంబడి ఎండు గడ్డిని తొలగించుకోవాలని సూచిస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
అగ్ని ప్రమాదాల వల్ల్ల కాలిపోయిన పండ్ల తోటలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం రాదు. రైతులు పొలం గట్ల వద్ద ఉన్న ఎండు గడ్డిని తొలగించుకుని జాగ్రత్త పడాలి. పొలంలోకి వచ్చే కూలీలు బీడీ, సిగరెట్ తాగకుండా చూసుకోవాలి. తోటలకు మంటలు వ్యాపించే అవకాశాలు ఉంటే వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. – అమరేశ్వరి,
ఉద్యానశాఖ అధికారిణి, ధర్మవరం
మంట.. తంటా
సమీపిస్తున్న వేసవి కాలం
మందుబాబుల చేష్టలతో
తోటలకు నష్టం
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న
అధికారులు
రైతన్నా.. బహుపరాక్!


