సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
గుత్తి రూరల్: దేశంలో ధర్మం, సమాజాభివృద్ధి, గో సంరక్షణకు పాటుపడి బంజారాల ముద్దు బిడ్డగా విరాజిల్లుతున్న సేవాలాల్ మహరాజ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సంత్ శ్రీ సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పిలుపునిచ్చారు. గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీ సేవాగఢ్‌లో శనివారం రాత్రి సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు జ్యోతి ప్రజ్వలన చేసి, టెంకాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జీవన విధానాన్ని గిరిజనులు అలవర్చుకోవాలన్నారు. జల్ (నీరు), జమీన్ (భూమి), జంగల్ (అడవి) అనే నినాదంతో సేవాలాల్ గిరిజనుల హక్కుల కోసం పోరాడారన్నారు. అంతటి మహనీయుని ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. సేవాగఢ్‌ను పవిత్ర పుణ్యక్షేత్రం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే గురుకుల పాఠశాల, కళాశాలలు ఉన్నాయన్నారు. బంజారా నాయకులతో కలసి బాలికల కళాశాల, వసతిగృహం, ఇంజినీరింగ్ కళాశాల, ఇతర విశ్వవిద్యాలయాలతో విద్యా హబ్‌గా చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. భారతదేశంలో అతిపెద్ద జాతి బంజారాలదే అని అన్నారు. ట్రస్టు ఉపాధ్యక్షుడు కేశవనాయక్ మాట్లాడుతూ సేవాగఢ్ ఆలయ అభివృద్ధిని తాము ముందుండి నడిపిస్తామని చెప్పారు. ఇక్కడ బంజారా యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాలతో పాటు పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఉత్సవాలకు వచ్చిన ముఖ్య అతిథులను బంజారాల సంప్రదాయ తలపాగ (పగిడి)లతో ప్రత్యేకంగా సన్మానించారు.
సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి


