కొడికొండ చెక్‌పోస్టులో తనిఖీలు
చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న కొడికొండ చెక్‌పోస్ట్‌లో గురువారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి వస్తున్న గూడ్సు వాహనాలను డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (డీసీటీఓ) శ్రీలత ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన దాఖలాలు లేని పలు వాహనదారులకు జరిమానా విధించారు.
బడ్జెట్‌లో విద్యారంగానికి
ప్రాధాన్యతనివ్వాలి : ఏపీఎస్టీఏ
పెనుకొండ: అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీఎస్టీఏ (ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు, కార్యదర్శి తమ్మినేని చందనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతం కాకపోతే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలన్నారు. ఈ సమావేశాల్లోనే పీఆర్సీ నియాకంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ బిల్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తక్షణమే 30 శాతం మధ్యంతర భృతి, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులు, బకాయిలను విడుదల చేయాలని విన్నవించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు.
17న జిల్లా స్థాయి క్రీడా పోటీలు
పుట్టపర్తి టౌన్: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి బి.కిషోర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 17న జిల్లా స్థాయి చెస్ పోటీలు ధర్మవరంలోని కళాజ్యోతి క్రీడా ప్రాంగణంలో, ఈ నెల 24న ధర్మవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో సైక్లింగ్ పోటీలు ఉంటాయి. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న క్రీడాకారులు శాప్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 98481 87636 లో సంప్రదించవచ్చు.
నిధులు విడుదల చేయాలంటూ టీడీపీ సర్పంచ్ ధర్నా
పెనుకొండ(గోరంట్ల): పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ గోరంట్ల మండలం మలసముద్రం పంచాయతీ టీడీపీ సర్పంచ్ సువర్ణ వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలసి గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ఽబైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే పూర్తి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నిధులు విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉప ముఖ్యమంత్రిని కలసి గోడు వెళ్లబోసుకుంటామన్నారు.అలాగే పంచాయతీలో తాగునీటి పథకం నిలిచిపోయిందన్నారు. నీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంపీడీఓ కమలాబాయి స్పందించి..త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.


