చిన్నారి అనుమానాస్పద మృతి
● టీకా వికటించడం వల్లేనని తల్లిదండ్రుల ఆరోపణ
యల్లనూరు: వ్యాధి నిరోధక టీకా వేసిన కొన్ని గంటల తర్వాత ఓ చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. టీకా వికటించడం వల్లే ప్రాణం పోయిందంటూ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం నిట్టూరుకు చెందిన అనిత, ఓబులేసు దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో మూడో సంతానమైన మూడు నెలల కుమార్తెకు బుధవారం ఉదయం 11 గంటలకు ఏఎన్‌ఎం ఎస్తేర్ రాణి ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకా వేయించారు. అయితే సాయంత్రం చిన్నారికి జ్వరం వచ్చింది. ఈ సమయంలో తల్లి పాలు పట్టింది. అయితే చిన్నారికి నోరు, ముక్కులోంచి పాలురావడం, అపస్మారకస్థితికి చేరుకోవడంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయారు. టీకా వేయడం వల్లే ఇలా జరిగిందని భావించిన వారు హుటాహుటిన తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న యల్లనూరు వైద్యులు లోకేష్‌కుమార్ తాడిపత్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. నిట్టూరులో ఈ చిన్నారితో పాటు మరో ముగ్గురికి టీకాలు వేసినట్లు గుర్తించారు. టీకా గడువు కూడా ముగియలేదు. ఒకవేళ టీకా వికటించి ఉంటే మిగిలిన చిన్నారుల ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లేదని వైద్యులు తెలిపారు. చనిపోయిన చిన్నారికి ఇంకేదైనా అనారోగ్యం ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని స్పష్టం చేశారు. అయినప్పటికీ చిన్నారి మృతిపై గ్రామంలో విచారణ కొనసాగుతోందని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. టీకా వికటించడం వల్లే చిన్నారి చనిపోయిందనే అనుమానం ఉంటే పోస్టుమార్టం చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని డాక్టర్ లోకేష్‌కుమార్ చిన్నారి తల్లిదండ్రులతో చర్చించారు.


