శవంపై శవం.. ఎన్నాళ్లిలా? | - | Sakshi
Sakshi News home page

శవంపై శవం.. ఎన్నాళ్లిలా?

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

శవంపై శవం.. ఎన్నాళ్లిలా?

శవంపై శవం.. ఎన్నాళ్లిలా?

బత్తలపల్లి:‘నివాసముండేందుకు ఎలాగూ స్థలాలు ఇవ్వలేకపోతున్నారు. కనీసం చనిపోయాకనైనా శవం పూడ్చేందుకు ఆరడుగుల స్థలం కేటాయించండయ్యా’ అంటూ అధికారులను బత్తలపల్లి వాసులు వేడుకుంటున్నారు. బత్తలపల్లి శ్మశాన వాటికలో మృతదేహాలను పూడ్చేందుకు ఆరడుగుల స్థలం లేక కాలనీవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో ఎక్కడ తవ్వినా ఒకటి, రెండు పుర్రెలు, అస్థి పంజరాలు బయటపడుతున్నాయి. గ్రామం ఏర్పడినప్పుడు 1.47 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన వాటిక ఉండేది. రానురాను ఆక్రమణలకు గురి కావడంతో శ్మశాన వాటిక కుంచించుకుపోయింది. ప్రస్తుతం ఎకరా విస్తీర్ణానికి మాత్రమే పరిమితమైంది. రోడ్డు విస్తరణ జరిగితే అది కూడా ఉండదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనాభాకు అనుగుణంగా

బత్తలపల్లిలో దాదాపు 25వేల మంది జనాభా ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో కొంత సమాధులతో నిండిపోగా మిగిలిన కొద్దిపాటి స్థలంలో ఖననం చేయాల్సి వస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చట్టపరంగా కనీసం మూడు ఎకరాల స్థలం శ్మశాన వాటికకు కేటాయించాల్సి ఉంది. ఈ అంశంపై పాలకుల వద్ద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఎవరైనా మృతి చెందితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటోంది.

ఇతర ప్రాంతాల్లో ఖననాలు

శ్మశాన వాటికకు స్థలం కేటాయింపుపై గతంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట స్థానికులు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అలాగే ధర్మవరం ఆర్డీఓ, జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ను కలిసివినతి పత్రం అందజేశారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కూ వినతి పత్రం అందజేశారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీలు తప్ప ఇప్పటి వరకూ ఆచరణలో కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక శ్మశాన వాటికలో మృతదేహాలను పాతి పెట్టేందుకు స్థలం లేక చాలా మంది తమ స్వగ్రామాలకో, అనంతపురంలోనూ ఖననం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి ఊరికి దూరంగా మూడు ఎకరాల్లో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఆరడుగుల స్థలం లేక అష్టకష్టాలు

కుంచించుకుపోయిన శ్మశాన వాటిక

అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం

స్థలం కేటాయించాలంటున్న గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement