బీజేపీ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని భ్రష్టు పట్టించింది: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల | - | Sakshi
Sakshi News home page

బీజేపీ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని భ్రష్టు పట్టించింది: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

బీజేపీ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని  భ్రష్టు పట్టించింది: ఏ

బీజేపీ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని భ్రష్టు పట్టించింది: ఏ

శింగనమల(నార్పల): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల విమర్శించారు. నార్పల మండలం బండ్లపల్లిలో సోమవారం ఆమె ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం 2006 ఫిబ్రవరి 2న ఇదే గ్రామంలో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేతుల మీదుగా ప్రారంభింపజేశారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా కరువు ప్రాంతం కావడంతో ఈ పథకాన్ని ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. ఈ పథకం ఉపాధి కూలీల జీవితాల్లో వెలుగులు తెచ్చిందన్నారు. అలాంటి పథకానికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పేరు మార్చడంతో పాటు నిర్వీర్యం చేస్తోందన్నారు. 40 శాతం నిధులు రాష్ట్రాలే భరించాలని పేర్కొనడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి,రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు దాదాగాంధీ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి, శింగనమల కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ సాకే శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

తండ్రిపై కుమారుడి దాడి

పెద్దవడుగూరు: మండల పరిధిలోని జి.వెంకటాంపల్లిలో సోమవారం తండ్రి శ్రీనివాసులుపై అతని కుమారుడు సాయి కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు తెలిపిన మేరకు.. ఆస్తి తన పేరిట రాయాలంటూ కొన్ని రోజులుగా కుమారుడు సాయి తన తండ్రి శ్రీనివాసులుపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై సోమవారం సాయంత్రం తండ్రీకుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆక్రోశంతో సాయి తన తండ్రి శ్రీనివాసులు తలపై కట్టెతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడిని స్థానికులు పెద్దవడుగూరు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ ఆంజినేయులు తెలిపారు.

మరణించి.. మరో ఇద్దరికి చూపు

వజ్రకరూరు: ఆమె మరణించినా మరో ఇద్దరికి చూపు ప్రసాదించింది. వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరు గ్రామానికి చెందిన ఎం.భాగ్యలక్ష్మిదేవి (70) రెండు రోజుల క్రితం ఇంట్లో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. ఈ క్రమంలో మృతురాలు భాగ్యలక్ష్మిదేవి నేత్రాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు. ఆస్పత్రి ప్రతినిధి సమాచారం మేరకు ఐ టెక్నీషియన్‌ జి.రాఘవేంద్ర అక్కడికి చేరుకుని నేత్రాలను సేకరించారు. తమ తల్లి చివరి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుమారులు ఎం. రమేష్‌, ఎం.విశ్వ నాథ్‌, కుమార్తెలు శ్రీదేవి, విజయలక్ష్మి, ఉషారాణి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement