కనికరించండి.. న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

కనికరించండి.. న్యాయం చేయండి

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

కనికర

కనికరించండి.. న్యాయం చేయండి

పుట్టపర్తి టౌన్‌: ‘క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. మీరైనా కనికరించి న్యాయం చేయండి’ అంటూ బాధితులు ఎస్పీ సతీష్‌ కుమార్‌ను వేడుకున్నారు. సోమవారం పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి మొత్తం 130 వినతులు అందాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ సతీష్‌ కుమార్‌ అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి మాట్లాడారు. సంబంధిత పోలీస్‌ అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి న్యాయం చేయాలని ఆదేశించారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ ఇందిర, ఎస్‌బీ సీఐ వెంకటేశ్వర్లు, సీఐ లక్ష్మికాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వినతుల్లో కొన్ని...

● భర్త తనను మోసం చేసి వెళ్లిపోయాడని నేలకోట తాండాకు చెందిన సరస్వతీబాయ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. బత్తలపల్లి పశువైద్యశాలలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న గోరంట్ల మండలం పాలసముద్రంకు చెందిన సురేష్‌ నాయక్‌, తాను ఒకరినొకరం ప్రేమించుకుని గత ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నామన్నారు. కొన్ని రోజులు కాపురం చేసిన సురేష్‌నాయక్‌ ఉన్నట్లుండి వదిలి వెళ్లిపోయాడన్నారు. దీనిపై ధర్మవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు.భర్త కావాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎస్పీ ధర్మవరం డీఎస్పీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. సురేష్‌నాయక్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ చేసి సరస్వతికి న్యాయం చేయాలని ఆదేశించారు.

●తనను అత్తమామలు వేధిస్తున్నారంటూ రొద్దం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జ్యోతి తిరుమల అనే మహిళ ఎస్పీ ఎదుట వాపోయింది. తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో జీర్ణించుకోలేక అత్తమామతో పాటు తన భర్త సోదరుడు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, కులం పేరుతో దూషిస్తూ ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ బలవంతం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది. మడకశిర పోలీసుస్టేషన్‌ అధికారులకు ఎస్పీ ఫోన్‌ చేసి తగిన న్యాయం చేయాలని ఆదేశించారు.

కనికరించండి.. న్యాయం చేయండి1
1/1

కనికరించండి.. న్యాయం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement