ప్రగతి కూత పెట్టేనా? | - | Sakshi
Sakshi News home page

ప్రగతి కూత పెట్టేనా?

Feb 1 2026 3:04 AM | Updated on Feb 1 2026 3:04 AM

ప్రగతి కూత పెట్టేనా?

ప్రగతి కూత పెట్టేనా?

గుంతకల్లు: దక్షిణ మధ్య రైల్వేలో ఆదాయ పరంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌ ముందంజలో ఉంటోంది. అయితే కేంద్ర బడ్జెట్‌లో మాత్రం నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెడుతున్నారు. డివిజన్‌లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అరకొరగా నిధులు కేటాయిస్తుండటమే ఇందుకు కారణం. రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టే విధానాన్ని పదేళ్లుగా నిలిపివేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా బడ్జెట్‌ ప్రసంగంలో రైల్వేల ప్రస్తావన తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖకు నిధుల కేటాయింపులు కూడా తగ్గిపోయాయి. కొత్త రైల్వే జోన్‌ రానున్న నేపథ్యంలో గుంతకల్లు డివిజన్‌ నుంచి కొత్త రైళ్లు ప్రకటించాలన్న డిమాండ్‌ పెరిగింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో గుంతకల్లు రెండో అతిపెద్ద డివిజన్‌గా ఉంది. దీంతో గుంతకల్లు–విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా రాకపోకలు పెరుగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్త రైళ్ల ఆవశ్యకత ఏర్పడుతుంది. కనీసం ఈ ఏడాది (2026–2027) అయినా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ‘ప్రగతి’ కూత పెట్టిస్తారా అని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆదివారం పార్లమెంటులో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

రైల్వే డివిజన్‌లో ఇవీ ప్రధాన సమస్యలు..

● గుంతకల్లు జంక్షన్‌లో ఏడు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. ఇందులో 1, 2, 3 ప్లాట్‌ఫాంలపైకి వచ్చే రైళ్లు మిగిలిన 4, 5, 6, 7 ప్లాట్‌ఫాంలపైకి వెళ్లడానికి అవకాశం లేదు. దీంతో వీటిని అనుసంధానం చేయకపోతుండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్లాట్‌ఫాంల అనుసంధానం చేయడానికి రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో అనుమతులు ఇవ్వడంతోపాటు దాదాపు రూ.35 కోట్లకు పైగా నిధులు కేటాయించారు.

● దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కడప – బెంగళూరు మధ్య 255 కి.మీ ప్రాజెక్టుకు రూ.2,706 కోట్లు కేటాయిస్తూ 2008లో పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మార్గంలో దాదాపు 30 కి.మీ మేర పనులు పూర్తి చేశారు.

● 2023 బడ్జెట్‌లో కొత్త రైలు మార్గాల కోసం సర్వేలకు అనుమతిస్తూ ప్రతిపాదనలు పంపింది. ఆయా ప్రాజెక్టులకు డివిజన్‌ అధికారులు సర్వేలు పూర్తి చేసి నివేదికలను జోనల్‌ అధికారులకు ఇదివరకే పంపారు. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే రైలు మార్గాలు లేని ప్రాంతాల్లో నిర్మించి రైళ్లు పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ధర్మవరం–బళ్లారి మధ్య 130 కి.మీ, రాయచోటి–హిందూపురం మధ్య 162 కి.మీ, మంత్రాలయం–కర్నూలు మధ్య 100 కి.మీ, ముద్దనూరు – ముదిగుబ్బ మధ్య 90 కి.మీతో ప్రాజెక్టులు ఉన్నాయి.

రైళ్లు వచ్చేనా..?

డివిజన్‌ కేంద్రమైన గుంతకల్లు జంక్షన్‌ నుంచి పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, డీఆర్‌సీసీ సభ్యులు పలుమార్లు వినతులను డీఆర్‌ఎంతోపాటు జోనల్‌ అధికారులకు కూడా పంపారు. అయితే ఇంత వరకు ఏ ఒక్క ప్రతిపాదననూ ఆమోదించకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందులో ధర్మవరం – గుంతకల్లు – కాచిగూడ డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు, పుట్టపర్తి నుంచి షిర్డీకి, గుంతకల్లు – హైదరాబాద్‌, గుంతకల్లు–విజయవాడ మధ్య పగటి పూట ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడపాల్సి ఉంది. అదేవిధంగా సికింద్రాబాద్‌ – కర్నూలు మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైలును గుంతకల్లు వరకు పొడిగించాలనే డిమాండ్లు ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. కరోనా సమయంలో రద్దు అయిన బెంగళూరు – విజయవాడ – బెంగళూరు, గుంతకల్లు – ధర్మవరం – గుంతకల్లు ప్యాసింజర్‌ రైళ్లు ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఇక కొల్హాపూర్‌ – గుంతకల్లు వయా రాయచూర్‌ – సికింద్రాబాద్‌ మీదుగా మణుగూరు వెళ్లే రైళ్లు రద్దు చేశారు. ముంబై – చెన్నె మధ్య తిరిగే రైళ్లనూ రద్దు చేశారు. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త రైళ్లను, రద్దు అయిన రైళ్లను తిరిగి పట్టా లెక్కేటట్లు చూడాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

గుంతకల్లు రైల్వే డివిజన్‌పై

కరుణ చూపేరా?

నిధుల కేటాయింపుపై

ప్రజల గంపెడాశలు

నేడు పార్లమెంట్‌లో

ప్రవేశ పెట్టనునున్న కేంద్ర బడ్జెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement