అప్పులతో అభివృద్ధి సాధ్యమా? | - | Sakshi
Sakshi News home page

అప్పులతో అభివృద్ధి సాధ్యమా?

Feb 1 2026 3:04 AM | Updated on Feb 1 2026 3:04 AM

అప్పులతో అభివృద్ధి సాధ్యమా?

అప్పులతో అభివృద్ధి సాధ్యమా?

హిందూపురం టౌన్‌: మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశం రసాభాసగా మారింది. రూ.375 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అధికారులు అంకెల గారడీ చేశారని, అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తామంటూ గొప్పలు చెబుతున్నారని, ప్రజలపై భారం పడే బడ్జెట్‌ మార్చాలంటూ వైఎస్సార్‌ కౌన్సిలర్లు పట్టుబట్టారు. అయినా పాలక వర్గం, అధికారులు వినకపోతే వారు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం అధికార పార్టీ సభ్యులే బడ్జెట్‌కు ఆమోదం తెలుపుకున్నారు.

‘గొల్లపల్లి’ అప్పులే కట్టలేకపోతున్నాం..

పట్టణంలోని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో శనివారం మున్సిపల్‌ కౌన్సిల్‌ బడ్జెట్‌ సమావేశాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ డీఈ రమేష్‌ అధ్యక్షతన నిర్వహించారు. హిందూపురం పాలకసంఘం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.375 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో కేంద్రం నుంచి రూ.78 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.228 కోట్లు నిధులు వస్తాయని, మున్సిపాలిటికి బీపీఎస్‌ పథకం ద్వారా వచ్చే రూ.9 కోట్లను కలిపి రూ.315 కోట్లను అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. అలాగే పురపాలక సంఘానికి సొంత ఆదాయం రూ. 41.55 కోట్లు వస్తుందని, ఇందులో 35 కోట్లు మున్సిపల్‌ ఉద్యోగుల జీతభత్యాల నిర్వహణ, ఇంటింటా చెత్త సేకరణ, ఇతరాత్ర నిర్వహణ పనులు, విద్యుత్‌ చార్జీల చెల్లింపు తదితర వాటికి వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేశారు. 2014–19 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే టీడీపీ సర్కార్‌ గొల్లపల్లి నీటి పథకం కోసం చేసిన అప్పులకు నేటికీ వడ్డీలు చెల్లిస్తున్నామని మండిపడ్టారు. ఇప్పుడు తాజాగా అప్పులతో అభివృద్ధి చేసి ఆ భారాన్ని పట్టణ వాసులపై మోపడం ఎంతవరకు న్యాయమని కౌన్సిల్‌ ప్రతిపక్ష నేత ఆసిఫ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి, కౌన్సిలర్‌ నాగేంద్రబాబులు వాపోయారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున అప్పులు చేయడం లేదని, వచ్చే నిధులను మాత్రమే చూపించామన్నారు. ఇదే విషయంపై కౌన్సిలర్‌ నాగేంద్రబాబు ఎన్‌హెచ్‌బీ లోన్‌ కింద రూ.136 కోట్లు వస్తున్నట్లు ఎలా చూపించారని ప్రశ్నించారు. రుణాలు కాకపోతే అకౌంట్‌ కోడ్‌ మార్చాలని నిలదీశారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనగా.. అప్పులతో అభివృద్ధి వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్సార్‌ సీపీ సభ్యులు నినాదాలు చేశారు. అఫ్పుల భారం పట్టణ వాసులపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి టీడీపీ వారే ప్రాతినిథ్యం వహిస్తున్నా...ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో రైల్వే రోడ్డు విస్తరణ చర్యలు చేపట్టి, 90 శాతం మందికి నష్టపరిహారం చెల్లించామని, కానీ ఆ పనులు చేయలేకపోయారన్నారు. అలాగే రైల్వే రోడ్డును వేయలేకపోయారని, కేవలం కొలతలు వేస్తూ, ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అంకెల గారడితో రూపొందించిన ఈ బడ్జెట్‌ ను తాము వ్యతిరేకిస్తున్నామని, బడ్జెట్‌ను సవరించాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పట్టుపట్టినా.. అధికారులు, టీడీపీ కౌన్సిలర్లు వినకపోవడంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు సభలో నుంచి వెళ్లిపోయారు.

మున్సిపల్‌ బడ్జెట్‌పై ప్రశ్నించిన

వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు

బడ్జెట్‌ సవరించాలని డిమాండ్‌...

అధికారులు వినకపోవడంతో వాకౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement