నిలదొక్కుకున్నాం
● రైతు ఇంట లాభాల మూట ● ఈసారి రికార్డు స్థాయిలో వక్క ఉత్పత్తి ● మార్కెట్‌లో ధరలు ఆశాజనకం ● ప్రారంభంలో క్వింటా రూ.65 వేలు పలికిన వైనం
మడకశిర: వక్కతోటల సాగుకు మడకశిర నియోజకవర్గం పేరుగాంచింది. జిల్లాలో దాదాపు 2,500 హెక్టార్లలో వక్క తోటలు విస్తరించి ఉండగా.. అందులో ఒక్క మడకశిర నియోజకవర్గంలోనే 2 వేల హెక్టార్లలో రైతులు వక్క తోటలు సాగుచేస్తున్నారు. మిగతా 500 హెక్టార్ల వక్కతోటలు పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇక్కడి రైతులు ఏటా రికార్డు స్థాయిలో వక్కలు ఉత్పత్తి చేస్తారు. అయితే మార్కెట్‌లో ఆశించినంత ధర లేక నష్టాలు మూటగట్టుకునే వారు. కానీ ఈసారి వక్క రైతుకు లాభాలు తెచ్చిపెట్టింది.
దిగుబడితో పాటు పెరిగిన ధర..
గత ఏడాది వక్క ధర ఆశాజనంగా ఉన్నా... దిగుబడి తగ్గిపోవడంతో రైతులు నష్టాలు చవిచూశారు. గతంలో ఎకరాకు 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి రాగా, ఈ సీజన్‌లో ఏకంగా 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మరోవైపు ఈ సీజన్‌లో వక్క రికార్డు స్థాయిలో ధర పలికింది. సీజన్ ప్రారంభంలోనే క్వింటా వక్క ధర ఏకంగా రూ.65 పలకగా..రైతు మోము ఆనందంతో వెలిగిపోయింది. అయితే సీజన్ ముగుస్తున్న కొద్దీ ధర కాస్త తగ్గింది. ప్రస్తుతం క్వింటా వక్క రూ.55 వేల వరకూ పలుకుతోంది. ధరలు నిలకడగానే కొనసాగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వక్క ఉత్పత్తి విలువ రూ.55 కోట్లపైనే..
ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా రూ.55 కోట్ల విలువైన వక్క పండినట్లు మార్కెట్ వర్గాల అంచనా. అందులో ఒక్క మడకశిర నియోజకవర్గంలోని రైతులే రూ.48 కోట్ల విలువైన వక్కలు పండించినట్లు చెబుతున్నారు. దిగుబడి పెరగడం వల్లే వక్క ఉత్పత్తుల విలువ భారీగా పెరిగిందని చెబుతున్నారు. గత ఏడాది ధర బాగున్నప్పటికీ దిగుబడి లేకపోవడంతో వక్క ఉత్పత్తి విలువ రూ.30 కోట్లలోపే ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
సీజన్‌లో కూలీలకు చేతినిండా పని..
ఏటా వక్క సీజన్ అగస్టులో ప్రారంభమై జనవరి చివర్లో ముగుస్తుంది. రైతులు చెట్ల నుంచి వక్కను నాలుగు విడతలుగా కోసి, శుద్ధిచేసి మార్కెట్‌కు తరలిస్తారు. దాదాపు 6 నెలల పాటు వక్క సీజన్ కొనసాగుతుంది. ఈ ఆరు నెలల కాలంలో వేలాది మంది కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది.
వక్క రైతుల మోము లాభాల సంతోషంతో
వెలిగిపోతోంది. ఈ సీజన్‌లో దిగుబడి
గణనీయంగా పెరగడంతో పాటు మార్కెట్‌లో ఆశించిన ధర దక్కడంతో రైతులు కష్టాల నుంచి గట్టెక్కారు. అయితే స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో పంట విక్రయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి జిల్లాలో వక్క
విక్రయాలు చేపడితే తమకు ఎంతో
మేలు జరుగుతుందని చెబుతున్నారు.
ధరలు ఆశాజనకం
వక్క దిగుబడి ఈ సారి బాగా పెరిగింది. దీంతో ఆర్థికంగా కొంత వరకు నిలదొక్కుకోవడానికి అవకాశం ఏర్పడింది. గత సీజన్‌లో ధరలు బాగానే ఉన్నా.. దిగుబడి తగ్గడంతో ఆర్థికంగా నష్టపోయాం. అయితే ఈసారి దిగుబడితో పాటు ధరలు కూడా బాగానే ఉండటం లాభదాయకంగా మారింది. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలకు వక్కలను తీసుకువెళ్లాల్సి వస్తోంది. స్థానికంగానే వక్కకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. – వీరక్యాతరాయప్ప,
గౌడనకుంట, అమరాపురం మండలం
వక్క ధరలు ఈసారి ఆశాజనకంగా ఉండటం ఆనందంగా ఉంది. ప్రస్తుతం క్వింటా వక్కలు రూ.55 వేల వరకు పలుకుతున్నాయి. వక్క ధర ఇంకా పెరుగుతుందన్న ఆశతో చాలా మంది రైతులు సరుకును ఇంట్లోనే నిల్వ ఉంచుకున్నారు. మొత్తంగా చూస్తే ఈ సీజన్‌లో దిగుబడి, మార్కెట్‌లో ధర ఆశించినంత ఉండటంతో రైతులు లాభపడ్డారు. – ప్రకాశ్, తమ్మడేపల్లి,
అమరాపురం మండలం
నిలదొక్కుకున్నాం
నిలదొక్కుకున్నాం
నిలదొక్కుకున్నాం
నిలదొక్కుకున్నాం
నిలదొక్కుకున్నాం


