చేప కరువు.. బతుకు బరువు | - | Sakshi
Sakshi News home page

చేప కరువు.. బతుకు బరువు

Jan 31 2026 10:25 AM | Updated on Jan 31 2026 10:25 AM

చేప క

చేప కరువు.. బతుకు బరువు

పుట్టపర్తి అర్బన్‌: చంద్రబాబు సర్కార్‌ మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఆర్థికంగా ఎలాంటి చేయూత ఇవ్వని సర్కార్‌... కనీసం చెరువుల్లో చేపపిల్లలను కూడా వదలకుండా మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసింది. దీంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

పాలకుల నిర్లక్ష్యం.. ఒట్టిపోయిన చెరువులు..

వర్షాభావం... ముందుచూపులేని పాలకుల నిర్లక్ష్యం తోడుకావడంతో చెరువులన్నీ ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. జిల్లాలో 23 చేపల చెరువులు, 4 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇందులో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, యోగి వేమన, గుంజేపల్లి, పేరూరు ఉన్నాయి. గుంజేపల్లి రిజర్వాయర్‌ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. పేరూరు డ్యాం గేటు విరిగిపోయినా నేటికీ అమర్చక పోవడంతో నీళ్లన్నీ కిందకు వెళ్లిపోయి డ్యాం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం అందులో 5 శాతం కూడా నీళ్లు లేవు. ఇక జిల్లాలో 223 చెరువుల్లో కేవలం 22 చెరువుల్లో మాత్రమే నీళ్లున్నాయి. వాస్తవానికి తీవ్ర వర్షాభావం ఏర్పడినప్పుడు పాలకులు ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వచ్చే నీటితోనే రిజర్వాయర్లు, చెరువులు నింపుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా హంద్రీ–నీవా ద్వారా అందే కృష్ణా జలాలనూ చెరువులకు మళ్లించాలి. అప్పుడు తాగు, సాగునీటి తిప్పలు తప్పడంతో పాటు చెరువుల్లో చేపలు పెరిగి మత్స్యకారులకూ ఉపాధి దొరుకుతుంది. కానీ టీడీపీ పాలనలో చెరువుల నింపాలన్న ఆలోచనే ఏ ఒక్క ప్రజాప్రతినిధికీ లేకపోయింది. దీంతో చెరువుల్లో నీరు చేరక అవన్నీ ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. ఉపాధి కరువైన మత్స్యకారులు కుటుంబాలతో సహా వలస వెళ్లే పరిస్థితులు జిల్లా నెలకొన్నాయి.

ఆదుకున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌..

జిల్లాలో 47 మత్స్యకార సొసైటీలున్నాయి. ఆయా సొసైటీల ఆధ్వర్యంలో చేపలు పడతారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకే ప్రభుత్వమే చెరువుల్లో చేప పిల్లలను పెంచుతుంది. గతంలోనూ జగన్‌ సర్కార్‌ ఠంచన్‌గా చెరువుల్లో చేప పిల్లలను వదలేది. అలాగే చేపలు విక్రయించుకునేందుకు వీలుగా రూ.75 వేలు విలువ ద్విచక్ర వాహనాన్ని 16 కుటుంబాలకు అందజేశారు. చేపల వేటకు వెళ్లిన వారు ఎవరైనా అనుకోకుండా మృత్యువాత పడితే రూ.10 లక్షల పరిహారం, లైవ్‌ ఫిష్‌ విక్రయాలు సాగించే వారు రూ.10 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.లక్ష , రూ.20 వేలు చెల్లిస్తే రూ.2 లక్షలు రుణసదుపాయం కల్పించారు. చేపలతో తయారైన వంటకాలు విక్రయించేందుకు ప్రత్యేకంగా రెస్టారెంట్‌ ఏర్పాటు చేసే ఔత్సాహికులకు రూ.20 లక్షల వరకూ రుణాన్ని మంజూరు చేసి ఉపాఽధి అవకాశాలు కల్పించారు.

చెరువుల్లో చేప పిల్లలను వదలని

చంద్రబాబు సర్కార్‌

ఆర్థిక ప్రోత్సాహమూ కల్పించని వైనం

ఉపాధి కోల్పోయిన మత్స్యకార

కుటుంబాలు

పూట గడవని స్థితిలో పెరిగిన వలసలు

చేపలకు డిమాండ్‌ ఉంది

ఇటీవల చాలా మంది చికెన్‌, మటన్‌ స్థానంలో చేపలను ఎక్కువగా తింటున్నారు. దీంతో స్థానికంగా డిమాండ్‌ పెరిగింది. కానీ చెరువుల్లో చేపలు దొరక్క ఇతర జిల్లాల నుంచి వచ్చే వాటిపై ఆధారపడ్డాం. ప్రసుత్తం కిలో చేపలు రూ.100 నుంచి రూ.300 వరకూ పలుకుతున్నాయి. జిల్లాలోనే పెద్దదైన బుక్కపట్నం చెరువులో నీళ్లు సమృద్ధిగా ఉన్నా... ప్రభుత్వం చేప పిల్లలను వదల లేదు. దీంతో జీవనాధారం లేక మత్య్సకార కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.

– రమేష్‌, పుట్టపర్తి

ఉపాధి కరువైంది

గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చారు. పింఛన్లతో పాటు మోపెడ్‌లు, ఫిష్‌ ఆంధ్రా యూనిట్లు ఇచ్చి ప్రోత్సహించారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. కనీసం చెరువుల్లో చేప పిల్లలను సైతం వదలకపోవడంతో మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కరువైంది. – నాగేంద్ర, కొత్తచెరువు

త్వరలోనే చేప పిల్లలు

వదులుతాం

ఈ ఏడాది వర్షాలు లేక చాలా చెరువుల్లో నీళ్లు లేవు. ఇక జిల్లాలో నీళ్లు సమృద్ధిగా ఉన్న 22 చెరువులను గుర్తించాం. ఆయా చెరువుల్లో చేప పిల్లలను వదలడానికి ప్రభుత్వానికి ప్రణాళికలు పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే చెరువుల్లో చేప పిల్లలను వదులుతాం. – చంద్రశేఖర్‌రెడ్డి,

మత్స్య శాఖ జిల్లా అధికారి

చేప కరువు.. బతుకు బరువు 1
1/1

చేప కరువు.. బతుకు బరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement