చంద్రబాబు హయాంలో చేనేత నిర్వీర్యం
పెనుకొండ రూరల్: చంద్రబాబు హయాంలో చేనేత రంగం నిర్వీర్యమైందని, సర్కార్ సాయం లేక నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సోమందేపల్లిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘నేతన్న పోరు’ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత స్థానిక చౌడేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు చేనేత కార్మికులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉషశ్రీచరణ్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరి రెండేళ్లవుతున్నా...చేనేతలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేకపోయిందన్నారు. గతంలో వైఎస్ జగన్ అమలు చేసిన ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా చేనేతలకు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్ అందేదన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం చేనేతల గురించి పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్ల కాలంలో నేతన్నలకు నూతనంగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదన్నారు. చేనేత ముడిసరుకుల ధరల నియంత్రణకూ చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ప్రభుత్వానికి నేత కార్మికుల బాగోగులు పట్టలేదన్నారు.
చేనేత కార్మికుల కష్టాలు పట్టవా..?
చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఉన్న సవితకు రెండేళ్లుగా చేనేత కార్మికుల కష్టాలు గుర్తుకు రాలేదని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నేతన్నల కోసం పోరు కార్యక్రమం తలపెట్టగానే మంత్రి... ఆగమేఘాల మీద అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి... ఏప్రిల్ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారన్నారు. వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేస్తే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వానికి గుర్తుకు రావా అని ప్రశ్నించారు. చేనేతలకు నూతన ఫించన్లు ఎప్పుడు ఇస్తారో కూడా మంత్రి ప్రకటించాలన్నారు. చేనేతల సంక్షేమంపై మంత్రి సవితకి చిత్త శుద్ధి ఉంటే చేనేత కార్మికుల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.
నేతన్నల కష్టాలు తెలిసిన నేత జగన్..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు చేనేతలకోసం అమలు చేశారని ఉషశ్రీచరణ్ గుర్తు చేశారు. ఆప్కో బకాయిలు రూ.108 కోట్లు చెల్లించారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి చేనేత ముడి సరుకుల ధరలు తగ్గించారన్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి చేనేత కార్మికునికీ ఏడాదికి రూ.24 వేలు ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.
బోలే బాబాకు టెండర్ ఇంచ్చింది చంద్రబాబే
టీటీడీ లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారంటూ చంద్రబాబు ప్రభుత్వం కావాలనే వైఎస్సార్ సీపీపై విష ప్రచారం చేసిందని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. నెయ్యిలో కల్తీ జరగలేదని ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిందన్నారు, 2018లో బోలే బాబా డెయిరీకి టెండర్ ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రాజకీయాలు కోసం దేవున్ని కూడా కూటమి ప్రభుత్వం వదల్లేదన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. దేవుడిపై రాజకీయాలు చేసిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్, సర్పంచ్ నరసింహమూర్తి, వైఎస్సార్ సీపీ కన్వీనర్లు, శ్రీనివాసులు, గజేంద్ర, శంకర, నరసింహ మూర్తి, బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, తిమ్మయ్య, నాయకులు వేణు గోపాల్, మంజునాథ్, లక్ష్మీనరసప్ప, జిలాన్ ఖాన్, క్రిష్టప్ప, సోము, శ్రీనివాస్ రెడ్డి, దామోదర్, జితేందర్ రెడ్డి, శివమ్మ, నాగళూరు బాబు, ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఎన్. నారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కంబాలప్ప, కొండలరాయుడు, బోయ రాము తదితరులు పాల్గొన్నారు.
నేతన్నలకు అందని కొత్త ఫించన్లు, అమలు కాని ఉచిత విద్యుత్
ఇప్పటికై నా ఇచ్చిన హామీలు
అమలు చేయాలి
బడ్జెట్‌లో చేనేతలకు ప్రత్యేకంగా
నిధులు కేటాయించాలి
హామీలు విస్మరిస్తే ఏప్రిల్‌లో
భారీ ఎత్తున ఉద్యమాలు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉష శ్రీ చరణ్
చంద్రబాబు హయాంలో చేనేత నిర్వీర్యం


