వైషమ్యాలు వీడితేనే ప్రశాంత జీవనం
● ప్రజలంతా కలసి మెలసి జీవించాలి
● పౌరహక్కుల సదస్సులో కలెక్టర్
శ్యాంప్రసాద్ ,ఎస్పీ సతీష్‌కుమార్
కనగానపల్లి: ఆధిపత్య పోరుతో అందరినీ నష్టమేనని, అందరూ వర్గ వైషమ్యాలు వీడి ప్రశాంత జీవనం సాగించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. శుక్రవారం వారు మండల పరిధిలోని తగరకుంటలో నిర్వహించిన పౌరహక్కుల సదస్సులో ముఖ్య అథితులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...గ్రామాల్లో ప్రజలు సోదర భావంతో కలిసి జీవించాలన్నారు. హింసతో మానసిక ప్రశాంతత దూరం కావడం తప్ప ఒరిగేది ఏమీ ఉండన్నారు. ఏ గ్రామం కక్షలకు, ఘర్షణలకు దూరంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందన్నారు. అనంతరం పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ తమ హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు బాధ్యతగా జీవించాలన్నారు. ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ మహేష్, డీఎస్పీ హేమంత్ కుమార్‌తో మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రూప్–1లో మెరిసిన దివ్యశ్రీ
అనంతపురం: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలో దివ్య శ్రీ సత్తా చాటి డీఎస్పీ పోస్టు సాధించింది. రాష్ట్రంలో 25 మంది డీఎస్పీలుగా ఎంపిక కాగా.. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి దివ్య శ్రీ ఎంపికయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలుకు చెందిన దివ్యశ్రీ తల్లిదండ్రులు గాండ్ల రంగనాథం, క్రిష్టమ్మ. అనంతపురం నగరంలో స్థిరపడ్డారు. దివ్య శ్రీ సోదరుడు నంద కిరణ్ కెనడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. దివ్యశ్రీ సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గ్రూప్–1 సాధించడం సులభతరం అయ్యిందని చెప్పారు. డిగ్రీ నారాయణ ఐఏఎస్ అకాడమీ (హైదరాబాద్)లో పూర్తి చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చదివి.. గోల్డ్‌మెడల్ సాధించారు. గత గ్రూప్–1 ప్రశ్నపత్రాలు, సిలబస్‌లోని అంశాలపై పూర్తిగా దృష్టి పెట్టి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. 2022 నోటిఫికేషన్‌లో గ్రూప్–1 మెయిన్స్ రాశారు. గత తప్పిదాలను గ్రహించి, మెయిన్స్‌లో సరిదిద్దుకున్నట్లు వెల్లడించారు. గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. అమ్మా నాన్న ప్రోత్సాహంతోనే గ్రూప్–1 సాధించానని, సివిల్ సర్వీసెస్ తన లక్ష్యమని స్పష్టం చేశారు.
వైషమ్యాలు వీడితేనే ప్రశాంత జీవనం


