తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని బలవన్మరణం
ఓడీచెరువు (అమడగూరు): అమడగూరు మండల పరిధిలోని చీకిరేవులపల్లికి చెందిన పీట్ల రమేష్, అనిత దంపతుల కుమార్తె ఝాన్సీ (14) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు... అమడగూరు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో ఝాన్సీ తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే సరిగా చదవడంలేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న అమడగూరు ఎస్‌ఐ గోపాలక్రిష్ణ, నల్లమాడ సీఐ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఆత్మకూరు: ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని నందిని (18) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నందిని విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 23న స్వగ్రామమైన కళ్యాణదుర్గం మండలం బాలవెంకటాపురంకు వచ్చింది. తాను ఎక్కువగా చదువుకున్నది , ఉన్నది తలుపూరులో అవడంతో తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటానంటూ ఈ నెల 28న తలుపూరుకు వచ్చింది. 29న తండ్రి నాగరాజు కళాశాలలో వదిలివస్తాను బయలుదేరు అని చెప్పాడు. రేపు వెళ్తామని చెప్పి ఫోన్ పెట్టేసింది. శుక్రవారం ఉదయం కూడా నాగరాజు ఫోన్ చేసి కళాశాలకు వెళ్దాం బయలుదేరు అని చెప్పాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు చూసి తల్లిదండ్రులు నాగరాజు, మల్లీశ్వరికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నందినికి అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేదని వారు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడి మృతి
ధర్మవరం అర్బన్: పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన కొండన్న (80) ద్విచక్ర వాహనంపై మేడాపురం నుంచి పట్టణానికి వస్తుండగా పట్టణంలోని అరిగెల పోతన్న రైస్ మిల్ సమీపంలో వెనుక వైపు నుంచి లారీ ఢీకొందన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కొండన్నను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని, అయితే అక్కడ చికిత్స పొందుతూ కొండన్న మృతి చెందాడని తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ ఢీకొని
యువకుడి దుర్మరణం
లేపాక్షి: మండలంలోని పీ సడ్లపల్లి సమీపంలో ట్రాక్టర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందారు. వివరాలు ... హిందూపురం రూరల్ మండలంలోని జుమాకులపల్లికి చెందిన సునీల్ (26) హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లిలో మగ్గం పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి జుమాకులపల్లి నుంచి హిందూపురానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. లేపాక్షి మండలం పీ. సడ్లపల్లి సమీపంలో ప్రమాదశాత్తూ ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్‌ఐ నరేంద్ర సిబ్బందితో కలిసి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కారుబోల్తా –
నలుగురికి గాయాలు
చిలమత్తూరు: మండల పరిధిలోని 544–ఈ జాతీయ రహదారి కనుమ అటవీ ప్రాంతం సమీపంలో శుక్రవారం లేపాక్షి వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 ద్వారా హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని బలవన్మరణం
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని బలవన్మరణం


