ఉల్లంఘనులపై ఉక్కుపాదం
పుట్టపర్తి అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే ప్రాణాలకే ముప్పని తెలిసినా వాహన దారుల్లో మార్పు కరువైంది. ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. మత్తులోనే రోడ్డెక్కుతూ బతుకులను చిత్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో యువతే అధిక సంఖ్యలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏమవుతుందనే తెగింపు, ఒక్కసారే కదా అనే నిర్లక్ష్యం వెరసి ఎలా పడితే అలా వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నిర్లక్ష్యంతో ఇతరుల ప్రాణాలను కూడా బలిగొంటున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జిల్లాలోని ముఖ్య కేంద్రాల్లో హెల్మెట్ వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా పాల్గొనడం గమనార్హం.
కఠిన చర్యలే..
జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఏకంగా 25,756 కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో ఉల్లం‘ఘనుల’ నుంచి ఏకంగా రూ.1,06,10,811 జరిమానా వసూలు చేశారు. కేసుల్లో ఎక్కువగా లైసెన్సు, ఆర్సీలు లేనివి ఉండడం గమనార్హం. మొత్తం ఇలాంటి 10,997 కేసులకు రూ.18,14,850 జరిమానా విధించారు. రెండో స్థానంలో హెల్మెట్ ధరించకుండా రోడ్డు ఎక్కిన వారు ఉన్నారు. ఇందుకు సంబంధించి 7,060 కేసులు నమోదు చేసి రూ.36,27,400 వసూలు చేశారు. ఇక.. గత ఏడాది జిల్లాలో ఏకంగా 4,570 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. మందుబాబులకు రూ.15,41,161 జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని న్యాయస్థానాల్లో హాజరుపరచగా అక్కడ కూడా రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకూ జరిమానాలు పడ్డాయి. ఇదే క్రమంలో పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్‌లు నిర్వహించి లైసెన్సు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
రయ్ రయ్ మంటూ బైకులపై వాయువేగంతో దూసుకెళ్లడం, హెల్మెట్ ధరించక పోవడం, తాగి వాహనాలు నడపడం, ఇష్టారాజ్యంగా ప్రయాణిస్తామంటే ఇక కుదరదు. ఉల్లంఘనులపై ఎక్కడికక్కడ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. భద్రతా నిబంధనలను ఇప్పటికై నా తలకెక్కించుకోకుంటే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.
12 నెలలు.. 25,756 కేసులు... రూ.1.06 కోట్లు
పటిష్టంగా భద్రతా నిబంధనల అమలు
భారీగా జరిమానాలు
‘తలకెక్క’కుంటే తప్పదు మూల్యం
నిర్లక్ష్యం వీడాలని హితవు
ఉల్లంఘనులపై ఉక్కుపాదం
ఉల్లంఘనులపై ఉక్కుపాదం


