మామిడి పూత.. జాగ్రత్తలే శ్రీరామరక్ష
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో 49,870 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించాయి. 80 శాతం పైగా చెట్లలో ఈ ఏడాది పూత విరబూసింది. ప్రస్తుతం తోటలన్నీ పూతతో అలరారుతున్నాయి. దీంతో రైతులు ఆనందంలో ఉన్నారు. అయితే, ఇటీవల వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఆందోళన నెలకొంది. అక్కడక్కడా జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడం భయాందోళనను మరింత పెంచింది. ఈ క్రమంలో జాగ్రత్తలు పాటిస్తే పంటను కాపాడుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో బూడిద తెగులు, తేనె మంచు పురుగు, ఇతర చీడ పీడలు సోకే అవకాశముందని చెప్పారు. బూడిద తెగులు సోకిన తోటల్లో పువ్వు కాడలపై బూడిద ఏర్పడి పిందె పడిపోతుందన్నారు. దీని నివారణకు హెక్సాకొనజోల్ 2 ఎంఎల్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తేనె మంచు పురుగు, రసం పీల్చే పురుగులు వ్యాపిస్తే ఇమిడా క్లోఫైడ్ 0.5 ఎంఎల్ లేదా థయామెథాక్సామ్ 0.3 ఎంఎల్ లేదా ఎథిప్రోల్ 1.5 ఎంఎల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీచేయాలన్నారు. పూత 75 శాతం వికసించిన దశలో ఎలాంటి చీడపీడలు గమనించని పరిస్థితుల్లో మందులు పిచికారీ చేయరాదన్నారు. పిందెలు జొన్న గింజ, బఠాని లేదా గోలీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు రాలిపోతుంటే ప్లానోఫిక్స్ 3 ఎంఎల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.
కప్పలబండ వద్ద విరబూసిన
మామిడి చెట్లు


