రమణీయం.. బ్రహ్మ రథోత్సవం
రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మ రథోత్సవం రమణీయంగా సాగింది. ఉదయాన్నే రథాన్ని పూలు, మామిడి తోరణాలు, అరటి పిలకలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితులు రథం ముందు శాంతి హోమం, దీక్ష హోమం, బలిప్రదానం తదితర పూజలు చేశారు. శ్రీవల్లీప్రభ సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో ఆలయం నుంచి రథం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం భక్తులంతా స్వామి నామాన్ని స్మరిస్తూ దేవాలయం ప్రాంగణం నుంచి కోట వీధి వరకు రథం లాగారు. రథంపై అరటి పండ్లు, పూలు, బొరుగులు, తమలపాకు తదితర వాటిని విసిరి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవం సందర్భంగా దేవాలయం భక్తజనంతో కిటకిటలాడింది. బ్రహ్మ రథోత్సవానికి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. ఆలయ కమిటీ వారు భక్తులకు అన్నదానం చేశారు.
రమణీయం.. బ్రహ్మ రథోత్సవం


