బాలికల హక్కులపై అవగాహన అవసరం
● జిల్లా వైద్యాఽధికారి ఫైరోజా బేగం
పుట్టపర్తి టౌన్: బాలికల హక్కులపై అవగాహన అవసరమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఫైరోజాబేగం అన్నారు. శనివారం జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికా దినోత్సవం నిర్వహించారు. జిల్లా వైద్యాఽధికారి హాజరై జండా ఊపి ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి గణేష్ కూడలి వరకు ర్యాలీగా వచ్చి, అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ విద్యావంతులైన ఆడపిల్లలు పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని రంగాల్లో ప్రావీణ్యత సాధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాగదుర్గాదేవి, డెమో సుబ్రమణ్యం, హెచ్‌ఈ రామలక్ష్మి, సీహెచ్‌ఓ శివరాం, సూపర్‌వైజర్ రమణ, ఎంపీహెచ్‌ఓ శివయ్య, ఆశావర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాంధ్రా – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం, సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చిమొక్కలు, గడ్డి మొక్కలు, చెత్తాచెదారం తొలగించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పుట్టపర్తి అర్బన్: ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్న సోమశేఖర్ (30) శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సోమశేఖర్ శుక్రవారం రాత్రి పెడపల్లి నుంచి గాజులపల్లికి వెళ్తుండగా, మార్లపల్లి వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన సోమశేఖర్‌ను స్థానికులు, గ్రామస్తులు పెనుకొండకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐ క్రాంతి చెప్పారు. సోమశేఖర్ భార్య నందిని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భార్య మృతి.. భర్తకు గాయాలు
హిందూపురం: హిందూపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రత్నమ్మ (58) దుర్మరణం చెందగా, ఆమె భర్త నరసింహప్ప తీవ్రంగా గాయపడ్డాడు. గౌరీబిదనూరు తాలూకా దోర్లకుంటకు చెందిన నరసింహప్ప, రత్నమ్మ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మున్సిపల్ కార్యాలయం ఎదుట ఐషర్ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొనింది. రత్నమ్మ కిందపడి పోవడంతో ఆమె తలపై నుంచి వాహనం వెళ్లింది. దీంతో ఆమె ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన భర్త నరసింహప్పను స్థానికులు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బొలెరో బోల్తా... 8 మందికి గాయాలు
రొళ్ల: బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌తో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు..కర్ణాటక రాష్ట్రం మధుగిరి నియోజవర్గం సంతే దొడ్డేరి చెందిన 8 మంది బొలెరో వాహనంలో పావగడ సమీపంలో వక్క కాయల కోతకు శనివారం ఉదయం బయల్దేరారు. తిరిగి సాయంత్రం మడకశిర – రొళ్ల మీదుగా సంతేదొడ్డేరి బయల్దేరారు. కేపీతండా– కేజీ గుట్ట కాలనీ మధ్యలో మలుపు వద్ద బొలెరో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ రఘు, సోమశేఖర్, అరుణ, నరసింహమూర్తి, రవి, చేతన్, నవీన్, రాఖీ గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న తహసీల్దార్ షేక్షావలి రొళ్ల, అగళి 108 వాహనాలకు సమాచారం అందించి, రొళ్ల సీహెచ్‌సీకి తరలించారు. ఇందులో సోమశేఖర్‌కు తలకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
భార్య ఆత్మహత్య కేసులో భర్తకు రిమాండ్
కదిరి టౌన్: భార్య ఆత్మహత్య కేసులో పట్టణంలోని షాహమిరియా వీధిలో నివాసం ఉన్న షేక్ నాయబ్ రసూల్‌ను రిమాండ్ తరలించినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి శనివారం తెలిపారు. ఇటీవల షేక్ నాయబ్ రసూల్ వేధింపులు తాళలేక అతని భార్య షేక్ మున్నీ అత్మహత్య చేసుకుంది. నిందితుడిని అరెస్టు చేసి, కదిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అతన్ని కదిరి సబ్ జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
చిలమత్తూరు: మండలంలోని వెంకటాపురానికి చెందిన బోయ వెంకటరమణ (48) ఉరి వేసుకొని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. వెంకటాపురం గ్రామానికి చెందిన బోయ వెంకటరమణ, దేవమ్మ దంపతులకు ఏడుగురు సంతానం. వీరిలో ఒకరు మృతి చెందారు. కుటుంబ పోషణ భారమై ఇంట్లోనే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మునీర్ అహ్మద్ తెలిపారు. వెంకరటమణ దహన సంస్కారాలకు పోలీసులు చందాలు వేసుకొని దేవమ్మకు రూ.11వేలు అందించారు.
గురుకులాల్లో ఖాళీ సీట్లకు
దరఖాస్తు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ (డాక్టర్ బీఆర్ అండేడ్కర్) గురుకులాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 5వతరగతితోపాటు6–9 తరగతులు, ఇంటర్‌లో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె.విజయలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతికి ఎస్సీ, ఎస్సీ విద్యార్థులు 01–09–2015 నుంచి 31–08–2017 మధ్య, బీసీ, ఇతర విద్యార్థులు 01–09–2013 నుంచి 31–08–2017 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. అలాగే 6వ తరగతికి ఎస్సీ, ఎస్సీ విద్యార్థులు 01–09–2012 నుంచి 31–08–2016 మధ్య జన్మించిన వారు, బీసీ, ఇతర విద్యార్థులు 01–09–2014 నుంచి 31–08–2016 మధ్య జన్మించిన వారు, 7వ తరగతికి ఎస్సీ, ఎస్సీ విద్యార్థులు 01–09–2011 నుంచి 31–08–2015 మధ్య జన్మించిన వారు, బీసీ, ఇతర విద్యార్థులు 01–09–2013 నుంచి 31–08–2015 మధ్య జన్మించిన వారు, 8వ తరగతికి ఎస్సీ, ఎస్సీ విద్యార్థులు 01–09–2010 నుంచి 31–08–2014 మధ్య జన్మించిన వారు బీసీ, ఇతర విద్యార్థులు 01–09–2012 నుంచి 31–08–2014 మధ్య జన్మించిన వారు, 9వ తరగతికి ఎస్సీ, ఎస్సీ విద్యార్థులు 01–09–2009 నుంచి 31–08–2013 మధ్య జన్మించిన వారు బీసీ, ఇతర విద్యార్థులు 01–09–2011 నుంచి 31–08–2013 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 10వ తరగతికి ఎస్సీ, ఎస్సీ విద్యార్థులు 01–09–2008 నుంచి 31–08–2012 మధ్య జన్మించిన వారు బీసీ, ఇతర విద్యార్థులు 01–09–2010 నుంచి 31–08–2012 మధ్య జన్మించిన వారు, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఎస్సీ,ఎస్సీ విద్యార్థులు 01–09–2007 నుంచి 31–08–2011 మధ్య జన్మించిన వారు, బీసీ, ఇతర విద్యార్థులు 01–09–2009 నుంచి 31–08–2011 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని వెల్లడించారు. ఫిబ్రవరి 19లోగా రూ. 100 రుసుంతో వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఎస్సీ గ్రూప్–1కు 5 శాతం, ఎస్సీ గ్రూప్–2కు 32.5 శాతం, ఎస్సీ గ్రూప్–3కు 37.5 శాతం, ఎస్టీల కు 6 శాతం, బీసీ–సీలకు 11 శాతం, బీసీలకు 5 శాతం, ఓసీలకు 3 శాతం ప్రకారం సీట్లు రాష్ట్ర కార్యాలయ అధికారులు కేటాయిస్తారని స్పష్టం చేశారు.


