ఏమీ ఆశించకుండా మన కోసం కష్టపడి, మనం వృద్ధిలోకి రావాలని
తల్లిదండ్రుల సాయంతో నడుస్తున్న రవితేజారెడ్డి
గుంతకల్లు: విడపనకల్లు మండలం కడదరబెంచి గ్రామానికి చెందిన మహిపాల్‌రెడ్డి, పద్మజ దంపతులకు ఒక్కాగానొక్క కుమారుడు రవితేజారెడ్డి ఉన్నాడు. సాధారణ వ్యవసాయ కుటుంబం. తమ ఆర్థిక పరిస్థితికి మించి కుమారుడిని చదివించి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేయించారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల కష్టాలను దూరం చేయాలని భావించిన రవితేజారెడ్డి... బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రయోజకుడైన కుమారుడిని ఓ ఇంటి వాడిని చేయాలని భావించి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇలాంటి తరుణంలోనే 2020లో బెంగళూరులో చోటు చేసుకున్న ప్రమాదంలో రవితేజారెడ్డి తలకు, వెన్నెముకకు బలమైన గాయాలై మంచాన పడ్డాడు. అప్పటి నుంచి రవితేజారెడ్డి శరీరం క్రమంగా బలహీన పడుతూ వచ్చింది. కాళ్లు, చేతులు సచ్చుబడ్డాయి. మాటలు కూడా తడబడసాగాయి. కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని డాక్టర్లు సైతం స్పష్టం చేశారు.
రైతు కాస్త కూలీ అయ్యాడు..
చికిత్సకు వైద్యులు చేతులేత్తిసిన విపత్కర పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు ఆశ వదులుకోలేదు. రవితేజారెడ్డిని మామూలు మనిషిగా మార్చేందుకు ఆ మరుక్షణం నుంచే పోరాటం మొదలు పెట్టారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగారు... ఎందరో నిపుణులైన డాక్టర్లను కలిశారు. ఉన్న ఆస్తులు విక్రయించారు. మరింత డబ్బు అవసరం కావడంతో అప్పులు చేసి, రూ.20 లక్షలకు పైగా ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో పది మందికి అన్నం పెట్టే రైతు కాస్త కూలీగా మారాడు. ఆ దంపతుల ఆత్మవిశ్వాసం ముందు విధి తలవంచింది. ఐదేళ్లుగా కుమారుడి కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. ప్రతి రోజూ ఫిజియోథెరఫి అవసరం కావడంతో గ్రామాన్ని వదిలి గుంతకల్లుకు మకాం మార్చి రాజేంద్రనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ కుమారుడి బాగు కోసం శ్రమిస్తున్నారు. మార్కెట్ యార్డు మైదానంలో రోజూ రెండు గంటల పాటు నడక, వ్యాయామం చేయిస్తూ ఆ తల్లిదండ్రులు పడుతున్న తపనను గమనించిన చూపరుల హృదయాలు ద్రవిస్తున్నాయి. త్వరలో రవితేజారెడ్డి పూర్తిగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.
గొప్ప ఆదర్శమూర్తులు
పిల్లల బాగు కోసం తల్లిదండ్రులు పడే తపనకు నిదర్శనమే మహిపాల్‌రెడ్డి దంపతులు. నేటి తరానికి వీరు ఆదర్శ మూర్తులు. వారి ప్రయత్నం ఫలించి రవితేజారెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాలని కోరుకుంటున్నా.
– డాక్టర్ లక్ష్మయ్య, ప్రిన్సిపాల్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంతకల్లు
ప్రమాదంలో వెన్నెముక, తలకు బలమైన గాయాలు
అవయవాలు సచ్చుబడి మంచానికే పరిమితమైన యువకుడు
ఎదిగొచ్చిన కుమారుడి ఆరోగ్యం కోసం ఐదేళ్లుగా తల్లిదండ్రుల అలుపెరుగని పోరాటం
వారి సంకల్పం ఎదుట తలొగ్గిన విధి
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న యువకుడు


