జీజీహెచ్‌లో అక్రమ వసూళ్లు
● మగ బిడ్డ పుడితే రూ.2వేలు.. ఆడ బిడ్డకు రూ. వెయ్యి
● వైద్యాధికారుల విచారణలో నిగ్గుతేలిన వాస్తవం
● ఇద్దరి సస్పెన్షన్
అనంతపురం మెడికల్: ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో బిడ్డ పుడితే సంబంధీకుల నుంచి రూ.వేలల్లో డబ్బును అక్కడి సిబ్బంది లాగేసుకుంటున్నారు. ఇటీవల అనంతపురం రూరల్ పరిధిలోని ఓ గర్భిణికి సిజేరియన్ చేసి శిశువును వెలికి తీశారు. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్ వద్దనే ఓ ఎంఎన్‌ఓ రూ.వెయ్యి, లేబర్ వార్డులో ఎఫ్‌ఎన్‌ఓ రూ.వెయ్యి బలవంతంగా వసూలు చేసుకున్నారు. అలాగే శింగనమల నియోజకవర్గానికి చెందిన గర్భిణి ఆడ శిశువును ప్రసవించడంతో రూ.వెయ్యి ఇచ్చే వరకూ వదిలేది లేదంటూ భీష్మించారు. తామే పేదలమని అంత ఇచ్చుకోలేమని వారు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. చివరకు రూ.500తో సరిపెట్టారు. ఈ అంశాలు కాస్త జీజీహెచ్ సూపరింటెండెంట్ కేఎల్ సుబ్రహ్మణ్యం దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మలాబాయి, ఏఓ మల్లికార్జునరెడ్డి విచారణ చేపట్టారు. దీంతో అక్రమ వసూళ్లు వాస్తమని నిర్ధారణ కావడంతో ఎఫ్‌ఎన్‌ఓ పార్వతి, ఎంఎన్‌ఓ నరసింహులును సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు.
దారుణ పరిస్థితులు
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోజూ 20 నుంచి 25 ప్రసవాలు జరుగుతాయి. ఉమ్మడి జిల్లా నుంచి ప్రసవానికి ఇక్కడకు వచ్చే వారిలో 90 శాతం నిరుపేదలే ఉంటున్నారు. అయినా వీరు ప్రసవిస్తే కుటుంబ సభ్యులను అక్కడి సిబ్బంది బృందాలుగా ఏర్పడి వెంటాడి మరీ డబ్బు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు. మగ బిడ్డ పుడితే రూ.2 వేలు, ఆడ బిడ్డ పుడితే రూ.వెయ్యి చెల్లించాల్సిందేనంటూ వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా వేధింపులకు గురి చేస్తుంటారు. అంతేకాక దోబీలు సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ప్రసవానికి వెళ్లే సమయంలో గర్భిణికి స్టెరిలైజేషన్ చేసిన తెల్లచీరను ఇస్తారు. ప్రసవానంతరం ఆ చీరను బాలింత కుటుంబసభ్యులు శుభ్రంగా ఉతికి ఇవాల్సి వస్తోంది.


