వలస కార్మికుడి హత్య
పావగడ: తాలూకాలోని తిరుమణి పీఎస్ పరిధిలోని అప్పాజిహళ్లి శివారున ఉన్న శ్రీగంధ ఎస్టేట్ (అపెక్స్ ఫార్మ్)లో బిహార్‌కు చెందిన అబీద్‌ఆలీ (22) హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అదే ఎస్టేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు కార్మికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అబీద్‌ఆలీపై మిగిలిన ఇద్దరు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అబీద్‌ఆలీ మృతి చెందాడు. ఘటనపై తిరుమణి పీఎస్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
పీఏబీఆర్ గేట్లు బంద్
కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ క్రస్ట్ గేట్లను అధికారులు బంద్ చేశారు. డ్యాం నుంచి దిగువన ఉన్న మిడ్ పెన్నార్ రిజర్వాయర్‌కు 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పీఏబీఆర్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో గురువారం సాయంత్రం క్రస్డ్ గేట్లను బంద్ చేశారు. ప్రస్తుతం పీఏబీఆర్‌కు 220 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 340 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. నీటి మట్టం 5.18 టీఎంసీలు ఉన్నట్లు ఇరిగేషన్ జేఈఈలు లక్ష్మీదేవి, ముత్యాలమ్మ తెలిపారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ
చైర్మన్‌గా వడ్డే వెంకట్
అనంతపురం కల్చరల్: నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ముదిగుబ్బకు చెందిన వడ్డే వెంకట్‌ను నియమిస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకట్ నియామకంపై జిల్లా వడ్డెర సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
గర్భం దాల్చిన బాలిక
ఉరవకొండ: ప్రేమ పేరుతో ఓ బాలిక వంచనకు గురైంది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివరాలను ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది గురువారం వెల్లడించారు. బొమ్మనహళ్ మండలం శ్రీధరగట్టు గ్రామానికి చెందిన యువకుడు శివమణి కొంత కాలంగా ఉరవకొండ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మభ్యపెట్టి పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. విషయం గుర్తించిన బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్లంబింగ్ కోర్సు నైపుణ్య
శిక్షణకు నేడు ఎంపిక
అనంతపురం: ఏ.ఎఫ్.ఎకాలజీ సెంటర్‌లో ప్లంబింగ్ కోర్సు నైపుణ్య శిక్షణ ఎంపిక ప్రక్రియ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న యువకులకు బెంగళూరు ప్లంబింగ్ స్కూల్‌లో 75 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తారు. శిక్షణ అనంతరం ప్రభుత్వ సర్టిఫికెట్‌తో పాటు ప్లంబర్‌గా ఉద్యోగావకాశం కల్పిస్తారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు, 8వ తరగతి, డిగ్రీ (పాస్/ఫెయిల్), ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ (పాస్/ఫెయిల్ ) అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు 77807 52418లో సంప్రదించవచ్చు.
ఆ గన్ ఎక్కడిది?
అనంతపురం సెంట్రల్: నగరంలో విద్యుత్‌నగర్ సర్కిల్‌లో ఓ వ్యక్తి ఇంట్లో బయటపడిన గన్ ఎక్కడిదనే అంశంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. దంపతుల మధ్య నెలకొన్న మనస్పర్థల కేసులో దిశ పోలీసులు బుధవారం సదరు వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో గన్‌తో పాటు కత్తి పట్టుబడడం కలకలం రేపింది. గురువారం కూడా సదరు గన్ గురించి దిశ పోలీసులు నోరు మెదప లేదు.


