పక్కదారి పట్టిన దాణా
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో పశువుల దాణా పక్కదారి పట్టింది. 50 శాతం సబ్సిడీతో పశుసంవర్ధక శాఖ ద్వారా పంపిణీ చేయాల్సి ఉండగా.. టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఈ ప్రక్రియ కాస్త ప్రహసనంలా మారింది. ఇప్పటికే గోకులం షెడ్లు, ప్రత్యమ్యాయ విత్తనాలు, సబ్సిడీ వేరుశనగ తదితరాలన్నింటిలోనూ టీడీపీ నాయకుల పెత్తనం తారాస్థాయికి చేరుకుంది. అర్హులను కాదని టీడీపీ సానుభూతిపరులకే దాణా అందజేయాలంటూ నేతల ఒత్తిళ్లు తాళలేక కొన్ని మండలాల్లో పశువుల ఆస్పత్రుల తలుపులను సిబ్బంది మూసేస్తున్నారు.
జిల్లాకు చేరిన 599 టన్నుల దాణా..
జిల్లా వ్యాప్తంగా 1.2 లక్షల మంది రైతుల వద్ద సుమారు 3.5 లక్షల పాడి పశువుల ఉన్నాయి. ఇప్పటి వరకూ సుమారు 599 టన్నుల పశువుల దాణా జిల్లాకు చేరినట్లు సమాచారం. దీనిని చిన్న, సన్న కారు పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో అందజేయాలని నిబంధనలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటికే మూడు విడతలుగా పశువుల దాణా మంజూరైంది. మొదటి విడతలో 250 టన్నులు, రెండో విడతలో 169 టన్నులు, మూడో విడతగా ప్రస్తుతం 180 టన్నులు మంజూరైంది. ఒక్కో ఆర్‌ఎస్‌కేకు 10, 20 బస్తాలు అందజేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పాడిరైతులు ఉండడంతో అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల మితిమీరిన జోక్యం కారణంగా పార్టీలను అంటగట్టి రైతులకు దాణా పంపిణీ చేస్తున్నారు.
దాణా ఇవ్వలేదు
వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడునని నాకు పశువుల దాణా ఇవ్వలేదు. నాకు ఇవ్వొద్దంటూ టీడీపీ నాయకులు చెప్పినట్లు డాక్టర్ చెప్పడంతో కొప్పడ్డాను. దీంతో నన్ను బయటకు పంపేసి, తలుపులు మూసేశారు.
– లక్ష్మీనరసప్ప, పాడి రైతు, వెంగళమ్మచెరువు
పార్టీలను అంటగట్టి
పంపిణీ చేస్తున్న వైనం
టీడీపీ ఒత్తిళ్లను తాళలేక
పోతున్నామంటున్న అధికారులు


