దంపతుల ఆత్మహత్యాయత్నం
గుడిబండ: పండ్ల వ్యాపారంలో నష్టం రావడం.. సరుకు ఇచ్చిన రైతులు డబ్బుల కోసం నిలదీయడంతో మనస్తాపానికి గురైన దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుల బంధువులు తెలిపిన మేరకు... గుడిబండ మండలం దేవరహట్టి గ్రామానికి చెందిన కాంతరాజు, మారెక్క దంపతులు బెంగళూరు నగరంలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన పాతిరెడ్డి, తిమ్మారెడ్డి, రామాంజనేయులు తదితరులు వివిధ రకాల పండ్లను సరఫరా చేసేవారు. నెలకో, రెండు నెలలకో రైతులకు డబ్బులు చెల్లించేవారు. ఇలా చాలా ఏళ్లుగా వ్యాపారం కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆరు నెలలుగా రూ.80 లక్షల బకాయి పేరుకుపోయింది. పండ్లు సరఫరా చేసిన రైతులు ఒత్తిడి పెంచడంతో కాంతరాజు, మారెక్క ఫోన్ కాల్ తీయడం మానేశారు. చివరకు బెంగళూరు వదిలి స్వగ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పాతిరెడ్డి, తిమ్మారెడ్డి, రామాంజనేయులు మంగళవారం దేవరహట్టిలోని కాంతరాజు, మారెక్క ఇంటి వద్దకెళ్లి డబ్బు కోసం బైఠాయించారు. ఆరు నెలల్లో డబ్బులిస్తామని వారు చెప్పినా వినిపించుకోలేదు. అవమానంగా భావించిన కాంతరాజు, మారెక్క దంపతులు పురుగుల మందు తాగారు. వెంటనే గమనించిన గ్రామస్తులు వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
చికిత్స పొందుతున్న మారక్క, కాంతరాజు
పండ్ల వ్యాపారంలో నష్టం
సరుకు సరఫరా చేసిన వారికి
రూ.80 లక్షల బకాయి
ఇంటిముందు బైఠాయించిన రైతులు
మనస్తాపంతో పురుగు మందు తాగిన దంపతులు
దంపతుల ఆత్మహత్యాయత్నం


