భూములు లాక్కుంటే మేమెక్కడికెళ్లాలి?
హిందూపురం: హంద్రీ–నీవా కాలువ ద్వారా భూగర్భజలాలు వృద్ధి చెంది.. బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతూ వ్యవసాయానికి యోగ్యంగా ఉన్న భూములను పరిశ్రమల పేరిట బలవంతంగా లాక్కుంటే తాము ఎక్కడకు వెళ్లాలని రైతులు అధికారులను ప్రశ్నించారు. పరిశ్రమలకు భూ సమీకరణపై మలుగూరులో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణపై సమావేశం నిర్వహించారు. మలుగూరు, రాచపల్లి, చలివెందుల గ్రామ రైతులు హాజరయ్యారు. ఆర్డీఓ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులకు అన్ని విధాలా న్యాయం చేయడం కోసమే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామన్నారు. అందరి ఆమోదం మేరకే పరిశ్రమల కోసం భూములు తీసుకుంటామన్నారు. దీంతోపాటు భూములకు న్యాయమైన ధర నిర్ణయించి చట్ట ప్రకారం రైతులకు పరిహారం ఇప్పిస్తామన్నారు. మలుగూరు గ్రామ రెవెన్యూ పొలంలో దాదాపు రెండు వేల ఎకరాల భూ సేకరణకు ఏపీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసి మూడు నెలలు అవుతోందని, అయితే ఎకరాకు ఎంత ధర ఇస్తున్నారో తెలపాలని కోరితే అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేదో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నామని, బలవంతంగా భూములు లాక్కుని అన్యాయం చేయవద్దని వేడుకున్నారు.


