ధీమా ఇవ్వని చంద్రన్న బీమా
కదిరి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జగన్ సర్కారు అమలు చేసిన ‘వైఎస్సార్ బీమా’ పథకానికి ‘చంద్రన్న బీమా’ అని పేరు మార్చిందే కానీ ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఈ పథకం ద్వారా సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు గొప్పగా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తవుతున్నా నేటికీ పథకాన్ని అమలు చేయక పోవడంతో బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. పథకం అమలుకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు కూడా ఇప్పటి వరకూ విడుదల చేయలేదు కానీ, టీడీపీ కార్యకర్త మృతి చెందితే మాత్రం రూ.5లక్షలు చెల్లించడం గమనార్హం.
ఏదీ ఆర్థిక భరోసా?:
బాధిత కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకూ జిల్లాలో ఎక్కడా నయా పైసా చెల్లించినది లేదు. ఈ 17 నెలల్లో జిల్లాలో సహజ, ప్రమాదవశాత్తు మరణించిన వారు మొత్తం 289 మంది ఉన్నారు. వీరిలో సహజ మరణం చెందిన వారు 180 మంది కాగా, ప్రమాదాల్లో మృత్యువాతపడిన వారు 109 మంది ఉన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సహజ మరణం చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున రూ.9 కోట్లు, ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున రూ.10.9 కోట్లు ఇలా మొత్తం రూ.19.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయి ఆ కుటుంబాలు కుమిలిపోతుంటే వారికి బీమా పరిహారం చెల్లించకుండా ఆ వెబ్‌సైట్‌ను పూర్తిగా క్లోజ్ చేసింది. భర్తను కోల్పోయిన మహిళకు కనీసం వితంతు పింఛన్ కూడా ఇవ్వడం లేదు.
గత ప్రభుత్వంలో సకాలంలో చెల్లింపులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్విజయంగా అమలు చేశారు. కుటుంబ పెద్ద మరణిస్తే తక్షణ సాయంగా రూ.10వేలు సచివాలయ ఉద్యోగుల చేతుల మీదుగా అందజేసేవారు. మిగిలిన సొమ్మును నామినీ బ్యాంకు ఖాతాకు నెల రోజులు తిరక్కుండానే జమ చేస్తూ వచ్చారు. వైఎస్సార్ బీమా ద్వారా గత ప్రభుత్వం జిల్లాలో 723 కుటుంబాలకు రూ40.86 కోట్ల లబ్ధి చేకూరింది. ఇందులో కదిరి నియోజకవర్గంలో 118 మందికి రూ.6.52 కోట్లు, ధర్మవరంలో 118 మందికి రూ.6 కోట్లు, పుట్టపర్తిలో 106 మందికి రూ.5.83 కోట్లు, హిందూపురంలో 113 మందికి రూ.6.26 కోట్లు, మడకశిరలో 115 మందికి రూ.6.06 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలో 55 మందికి రూ.3.16 కోట్లను బాధిత కుటుంబాలకు చెల్లించింది. బీమా ప్రీమియం డబ్బులు సైతం అప్పట్లో జగన్ ప్రభుత్వమే చెల్లించింది.
పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలు
పరిహారం రాదు.. పింఛనూ ఇవ్వరు
కూటమి పాలనలో అమలుకు నోచుకోని
చంద్రన్న బీమా
ఈమె పేరు రామలక్ష్మమ్మ. తనకల్లు మండలం సింగిరివాండ్లపల్లి గ్రామం. ఈమె ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసులు (35) ఈ ఏడాది సెప్టెంబర్ 29న చీకటిమానిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. దీంతో చంద్రన్న బీమా లబ్ధి కోసం ఆమె తహసీల్దార్ కార్యాలయం, గ్రామ సచివాలయం చుట్టూ తిరగని రోజంటూ లేదు. ఆ వెబ్‌సైట్ ఇంకా ఓపెన్ కాలేదనే సమాధానమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి బాధిత కుటుంబాలు జిల్లాలో వందల్లో ఉన్నాయి. ఏ ఒక్కరిపై చంద్రన్న సర్కారు కనికరించలేదు.
ధీమా ఇవ్వని చంద్రన్న బీమా
ధీమా ఇవ్వని చంద్రన్న బీమా


