ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి
ఓడీచెరువు: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో బైక్‌పై వెళుతున్న వృద్ధురాలు మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఓడీచెరువు మండలం దాదిరెడ్డిపల్లికి చెందిన దాదిరెడ్డి సాలమ్మ (80) సోమవారం తన అల్లుడు శ్రీనివాసరెడ్డితో కలసి ఓడీ చెరువు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. జరికుంటపల్లి సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో శ్రీనివాసరెడ్డి, సాలమ్మ రోడ్డుపై పడ్డారు. దీంత్ర గాయపడినన సాలమ్మను అంబులెన్స్‌లో కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మనవడు భానుప్రకాష్ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు గణేష్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో దొంగల ముఠా?
ఎన్‌పీకుంట: మండల కేంద్రంలోని సోలార్ పవర్‌ప్లాంట్‌లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా సభ్యులను కదిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా ఎన్‌పీకుంట మండలానికి చెందిన 8 మందిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
కొత్తచెరువు: స్థానిక పీఎస్ పరిధిలో భూవివాదం కారణంగా చోటు చేసుకున్న హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ బి.విజయ్‌కుమార్ తెలిపారు. వివరాలను మంగళవారం వెల్లడించారు. కొత్తచెరువు మండలం మునిమడుగు గ్రామానికి చెందిన నీరుగంటి ఆంజనేయులు(55) వెంకటేష్, మనోహర్ కుటుంబాల మధ్య మునిమడుగు గ్రామంలోని 31.2 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆధిపత్యం, దివ్యాంగ పింఛన్ మంజూరు విషయంలో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో భూమి విషయంగా ఆంజనేయులు చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకున్న వెంకటేష్, మనోహర్ ఎలాగైనా ఆయనను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన తలారి చిరంజీవి, తలారి పోతులయ్య, బొగ్గు మహేంద్రను ప్రలోభాలకు గురి చేసి ఆంజనేయులుక హత్యకు పథకం రచించారు. ఈ ఏడాది మే 20న సాయంత్రం ఆంజనేయులు కొత్తచెరువు నుంచి మునిమడుగు గ్రామానికి వెళుతుండగా మరకుంటపల్లి గ్రామం వద్ద వాహనాన్ని అడ్డుకుని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 19న కొత్తచెరువు మార్కెట్ యార్డు వద్ద తచ్చాడుతున్న దాసరి వెంకటనారాయణ, కృష్ణక్క గారి వంశి, తలారి చిరంజీవి, తలారి పోతులయ్య, బొగ్గు మహేంద్రను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
అసంబద్ధ జీఓలను సవరించాలి : ఎస్టీయూ
ఎన్‌పీకుంట: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్ధికశాఖ జారీ చేసిన 60, 61 జీఓలు ఆసంబద్ధంగా ఉన్నాయని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించేలా జీఓలను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. స్ధానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 జనవరి నుంచి 2025 సెప్టెంబరు వరకు 21 నెలల డీఏ బకాయిలను ఉద్యోగి పదవీ విరమణ సందర్బంగా చెల్లిస్తామనడాన్ని ఖండించారు. బకాయిలను ఉద్యోగ విరమణ, మరణించిన తరువాత ఇస్తామని జీఓలు విడుదల చేయడం దారుణమన్నారు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ దాటవేత ధోరణి ప్రదర్శించడం మంచిదికాదని హితువు పలికారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చెల్లెలిపై అన్న అత్యాచారం
● వరుస మరిచి గర్భవతిని చేసిన వైనం
● కాన్పు అయ్యే వరకూ నిజాన్ని దాచిన బాలిక
ధర్మవరం అర్బన్: చెల్లెలిని ఇతరుల నుంచి రక్షించాల్సిన అన్నే ఆమె జీవితాన్ని చిదిమేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరంలో నివాసముంటున్న 17 ఏళ్ల బాలికపై ఆమె పెద్దమ్మ కుమారుడు కన్నేశాడు. పిన్ని ఇంట్లో లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. తరచూ ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన బాలిక... విషయం చెబితే కొడతారని భయపడి ఎవరితోనూ చెప్పుకోలేదు. శరీరంలో మార్పులు వచ్చినా... ఏదో కారణం చెబుతూ తప్పించుకుంటూ వచ్చింది. చివరకు ఈ నెల 18న కడుపు నొప్పితో బాధపడుతుంటే తల్లి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పిలుచుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలిక నిండు గర్భిణి అని నిర్ధారించారు. అనంతరం రక్తస్రావం అవుతుండటంతో కాన్పు చేసి మృత మగ శిశువును వెలికి తీశారు. విషయం తెలిసి కన్నీరుమున్నీరైన బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా.. పెద్దమ్మ కుమారుడే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.
ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి


