వీడిన హత్య కేసు మిస్టరీ
హిందూపురం: మండలంలోని సంతేబిదనూర్ పంచాయతీ తుంగేపల్లి వద్ద ఈ నెల 13న చోటు చేసుకున్న హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేవలం డబ్బు కోసమే యువకుడిని హత్య చేసి, ఎవరూ గుర్తు పట్టకుండా కాల్చివేసేందుకు ప్రయత్నించిన నలుగురుని అరెస్ట్ చేశారు. హిందూపురం రూరల్ పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ ఆంజనేయులుతో కలసి డీఎస్పీ మహేష్ వెల్లడించారు. ఈ నెల 13న గౌరీబిదనూరు తాలూకా కర్ణాటక హనుమంతనగర్‌కు చెందిన పవన్‌కుమార్ (29) సంతేబిదనూర్ వద్ద అతిగా మద్యం తాగి తూలుతూ మోటార్ సైకిల్ పక్కన కూర్చొని ఉన్నాడు. గమనించిన సంతేబిదనూర్ పంచాయతీకు చెందిన ఇద్దరు మైనర్ బాలురు.. అతనితో మాట్లాడుతూ కల్లు తాగుతామని నమ్మించి దూరంగా పిలుచుకెళ్లి డబ్బులు, వెండి చైను లాక్కొనేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పవన్‌కుమార్ తిరగబడ్డాడు. దీంతో మైనర్లు తమ వద్ద ఉన్న ఫోల్డింగ్ ఐరన్ రాడ్‌తో పవన్‌కుమార్ తలపై కొట్టారు. తర్వాత అక్కడే పడి ఉన్న ఖాళీ బీరు బాటిల్ పగులకొట్టి డొక్కలో, మెడపై, శరీరంపై ఇష్టానుసారంగా పొడిచి హతమార్చారు. అనంతరం హతుడి మెడలోని వెండి చైనుతో పాటు రూ.2,500 నగదు, అతని పల్సర్ బైకు తీసుకుని ఉడాయించారు. ఆ తర్వాత స్నేహితులైన హనుమేపల్లి ఆంజనేయులు, సంతేబిదనూరు ఆకర్ష్ (ఇద్దరూ మేజర్లు)ను తోడుగా పిలుచుకెళ్లి హతుడిపై పెట్రోల్ పోసి ప్లాస్టిక్ బాటిల్‌లు, కట్టె పుల్లలు వేసి నిప్పంటించారు. 14న ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో రూరల్ పీఎస్ సీఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హతుడిని పవన్‌కుమార్‌గా ధ్రువీకరించి, పక్కా ఆధారాలతో మంగళవారం అప్పకుంట గేట్ నుంచి హనుమేపల్లి గ్రామానికి వెళ్లే దారిలో హంద్రీ–నీవా కాలువ వద్ద తచ్చాడుతున్న నలుగురునీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో మేజర్లను న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. మైనర్లను జువైనల్ హోంకు అప్పగించారు.
డబ్బు కోసమే యువకుడి హత్య
గుర్తించకుండా కాల్చివేతకు ప్రయత్నం
పట్టుబడిన నలుగురిలో ఇద్దరు మైనర్లు


