ఘనంగా బాబా అవతార ప్రకటన దినోత్సవం
ఉరవకొండ: సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవాన్ని సోమవారం ఉరవకొండలో ఘనంగా నిర్వహించారు. అవతార ప్రకటన చేసిన రాతి గుండు వద్ద నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సత్యసాయి చిత్రపటాన్ని వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు.
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
బత్తలపల్లి: స్థానిక టోల్ ప్లాజా సమీపంలో గత నెల 10న రాత్రి ద్విచక్రవాహనం ఢీ కొనడంతో గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పాత కల్లూరుకు చెందిన నడిపోగుల ఓబన్న(60) గత నెల 10న అనంతపురంలో జరిగిన సీఎం సభకు బస్సులో వచ్చాడు. సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో పొరపాటున కదిరి వైపు వెళ్లే బస్సు ఎక్కాడు. మాటలు రాకపోవడం, కొత్త వ్యక్తి కావడంతో టోల్‌ప్లాజా వద్ద బస్సులో నుంచి దింపేశారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో అనంతపురం వైపుగా వెళుతున్న ఆయనను ద్విచక్రవాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. చికిత్సకు స్పందించక సోమవారం మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నాటు తుపాకీ స్వాధీనం
పుట్టపర్తి: మండలంలోని గూనిపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం నాటుతుపాకీతో సంచరిస్తున్న కొత్తకోట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో కొత్త వెలుగులు చూడడంతో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. అటవీ ప్రాంతంలో మరిన్ని ఆయుధాలు ఉన్నట్లుగా తెలుసుకున్న పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. కాగా, నాటు తుపాకీ విషయం వెలుగు చూడడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
తాడిమర్రి: మండలంలోని దాడితోట గ్రామంలో పేకాట ఆడుతూ పలువురు పట్టుబడ్డారు. అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ కృష్ణవేణి నేతృత్వంలో గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ఓ పాడుబడిన ఇంట్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, రూ.47,755 నగదు స్వాధీనం చేసుకున్నారు.


