
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
మడకశిర: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఆరుగురిని మడకశిర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.8.70 లక్షలు విలువ చేసే 18 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మడకశిర అప్‌గ్రేడ్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుబ్రహ్మణ్యంతో కలసి నిందితుల వివరాలను పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప వెల్లడించారు. రొద్దం మండలం రొప్పాల గ్రామానికి చెందిన సోమశేఖర్, అతని స్నేహితుడు ముద్దరంగయ్య ద్విచక్రవాహనాలు జిల్లేడుగుంట వద్ద 2024లో దుండగులు అపహరించారు. అలాగే అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన రాజేష్‌రెడ్డి ద్విచక్రవాహనాన్ని 15 రోజుల క్రితం మడకశిరలో ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మంగళవారం కల్లుమర్రి క్రాస్ వద్ద రెండు ద్విచక్రవాహనాలను విక్రయిస్తుండగా రొద్దం మండలం రొద్దకంపల్లి గ్రామానికి చెందిన సురేష్, నరేష్‌ను అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామాలకు చెందిన సంజయ్‌కుమార్, మల్లేష్, డి.అచ్చంపల్లి గ్రామానికి చెందిన అనిల్, వడ్డే కుమార్‌తో కలసి ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నట్లు అంగీకరించారు. గతంలో కర్ణాటకలోని మధుగిరి ప్రాంతంలోనూ ద్విచక్రవాహనాలను అపహరించిన కేసులో రిమాండ్‌కు వెళ్లినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించి, విక్రయానికి తెచ్చిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నాఉ. అనంతరం సంజయ్‌కుమార్ తన పొలంలో దాచిపెట్టిన 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలను బెంగళూరులోని కోరమంగలలో అపహరించినట్లుగా అంగీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
రూ. 8.70 లక్షల విలువ చేసే
18 ద్విచక్రవాహనాలు స్వాధీనం