వ్యక్తి బలవన్మరణం
నల్లమాడ: మండలంలోని ఎన్.ఎనుమలవారిపల్లికి చెందిన చిల్లా చిన్నగంగప్ప (54) ఆత్మహత్య చేసుకున్నాడు. తన అల్లుడు భాస్కర్ ప్రమాదవశాత్తు మృతిచెందడంతో కుమార్తె విధవరాలిగా మారడాన్ని తట్టుకోలేక సోమవారం ఉదయం 8 గంటల సమయంలో పొలం వద్ద పురుగుల మందు తాగాడు. అపస్మారకంగా పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కదిరి, అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. చికిత్సకు స్పందించక అదే రోజు రాత్రి 7 గంటలకు మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యక్తి ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్: కుటుంబ కలహాలతో పుట్టపర్తిలోని సాయినగర్‌లో నివాసముంటున్న రాము (34) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ కూలి పనులతో పిల్లలను పోషించుకుంటున్నారు. తాగుడుకు బానిసైన రాము.. తరచూ మద్యం మత్తులో భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం పుట్టపర్తి సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్ద మామిడి చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న బుక్కపట్నం ఎస్‌ఐ కృష్ణమూర్తి అక్కడు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
చెరువులో మృతదేహం
హిందూపురం: స్థానిక సూరప్పకుంట చెరువులో సోమవారం ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. విచారణలో రహమత్‌పుర ప్రాంతానికి చెందిన జబీవుల్లా (34)గా గుర్తించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా, జబీవుల్లా మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
జూదరుల అరెస్ట్
లేపాక్షి: ‘అధికారం మనదే.. ఆడుకోండి’ శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన పోలీసులు హిందూపురం, లేపాక్షి పరిసరాల్లో దాడులు నిర్వహించి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. లేపాక్షి మండలం బయన్నపల్లి శివారున పేకాట స్థావరంలో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకొని, రూ.34,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రూరల్ సీఐ జనార్దన్ తెలిపారు.
వ్యక్తి బలవన్మరణం


