
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పుట్టపర్తి టౌన్: విధి నిర్వహణలో అశువులుబాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీతో పాటు ఎమ్మెల్యే సింధూరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి ముఖ్య అతిథులు అమర వీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పోలీసుల కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పోలీస్ పాత్ర చాలా కీలకమన్నారు. పోలీసులు లేని సమాజం ఊహించలేమన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించే క్రమంలో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోతుంటారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరలైన పోలీసులందరికీ ఈ రోజు నివాళుర్పిస్తున్నామన్నారు.
పోలీస్ కటుంబాలకు అండగా ఉంటాం
దేశ వ్యాప్తంగా 258 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అందులో మన జిల్లాలో కూడా ఇద్దరు పోలీసులు ఉన్నారన్నారు. అమరవీరుల కుటుంబాల స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి అండగా ఉంటామని తెలిపారు. పది రోజులపాటు అమరులైన పోలీసులను స్మరించుకుంటూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఏఓ సుజాత, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు నరశింగప్ప, విజయకుమార్, హేమంత్‌కుమార్, ఆదినారాయణ, ఎస్‌బీ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు వలి, మహేష్, రవికుమార్, రాష్ట్ర పోలీస్ సంఘం సభ్యులు సూర్యకుమార్, సీఐలు శ్రీనివాసులు, శివాంజనేయులు, సురేష్, ఆర్‌ఎస్‌ఐలు వీరన్న, వెంకటేశ్వర్లు, ప్రదీప్‌సింగ్, ప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను చైతన్యవంతులను
బత్తలపల్లి: వివిధ అంశాలపైన, నేరాలపైన ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు, వారికి అవగాహన కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బత్తలపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో వివిధ గదులను, లాకప్‌లను, సీసీ కెమెరాల పనితీరు, రికార్డుల గదులు, కంప్యూటర్ గది తదితర వాటిని పరిశీలించారు. ప్రజలతో ఫిర్యాదులు స్వీకరణ, కౌన్సెలింగ్ గదిని పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై వివిధ అంశాలపైన వివరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ మహిళల అదృశ్యం కేసుల్లోనూ, ప్రేమ పేరుతో వెళ్లిపోతున్న వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఉగ్రవాదులు సమాచారం మేరకు విచారణ జరుగుతోందన్నారు. రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ సోమశేఖర్, ట్రైనీ ఎస్‌ఐ ప్రసన్న, ఏఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్