
నేటి నుంచి భారీ వర్షాలు
● అధికార యంత్రాంగం
అప్రమత్తంగా ఉండాలి
ప్రశాంతి నిలయం: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం నుంచి రెండు రోజుల పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. గాలి వేగం గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 55 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 08555 289039 నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే స్పందించి అధికారులు తగిన సహాయం అందిస్తారని తెలిపారు. మండల కేంద్రాలతో పాటు డివిజన్ కేంద్రాలలో కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో 467.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు ఈ నెల 24 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక రైలు ఈ నెల 24న నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ప్రతి శుక్రవారం (6 సర్వీసులు) షోలాపూర్ జంక్షన్ (01477)లో బయలుదేరుతుంది. 25వ తేదీ శనివారం నుంచి నవంబర్ 29 వరకు (6 సర్వీసులు) అనకాపల్లి జంక్షన్ (01478) నుంచి మరొకటి రాకపోకలు సాగిస్తుంది. ఈ రైళ్లు అకల్‌కోట్, గంగాపూర్, కలబురిగి, వాడీ, యాదగిరి, కృష్ణా, రాయాచూరు, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అన్నవరం, యలమంచిలి రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నట్లు వివరించారు. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్‌తోపాటు జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.
రెవెన్యూ క్రీడలు
విజయవంతం చేయాలి
అనంతపురం అర్బన్: అనంతపురం కేంద్రంగా నవంబరు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు విజయవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. క్రీడల నిర్వహణ ఏర్పాట్లు బాగుండాలని సూచించారు. రెవెన్యూ క్రీడల నిర్వహణపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతి ఉత్సవాలు ఆర్డీటీ స్టేడియంలో జరగనున్నాయన్నారు. ఆయా శాఖల ఉమ్మడి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. క్రీడాకారులకు వసతి, భోజనం, ఇతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ ఉన్నతాధికారులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రొటోకాల్‌పై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రెవెన్యూ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు రాయలసీమ వంటకాల రుచి చూపాలన్నారు. క్రీడలు విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, శ్రీనివాస్, మహేష్, వీవీఎస్‌శర్మ, సువర్ణ, ఆనంద్‌కుమార్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రమేష్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దివాకర్‌రావు, సోమశేఖర్, పరిపాలనాధికారి అలెగ్జాండర్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి పాల్గొన్నారు.

నేటి నుంచి భారీ వర్షాలు