
ఉగ్ర కదలికలపై ఖాకీ కన్ను
ధర్మవరం: ఉగ్ర కదలికలపై పోలీసులు డేగ కన్ను వేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న నూర్ మహమ్మద్ పట్టుబడటంతో అతనితో సంబంధాలున్న వారి కోసం పోలీసులు వేట మొదలెట్టారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు వెళ్లాయి.
వాట్సాప్ చాటింగ్ ఆధారాలతో
తీగలాగుతూ...
ధర్మవరానికి చెందిన కొత్వాల్ నూర్ మహమ్మద్ పాకిస్తాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్ ద్వారా సంభాషించడం, చాటింగ్ చేయడంతో పోలీసులు అతన్ని ఆగస్టు 16వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరెవరితో చాటింగ్ చేశాడు.. వారి అడ్రస్‌లు, వారికీ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలపై ఇప్పటికే ఆరా తీశారు. ఈ క్రమంలోనే నూర్ మహమ్మద్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 30కిపైగా గ్రూపుల్లో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు అనుమతితో అతని నుంచి స్వాధీనం చేసుకున్న సిమ్‌కార్డులు, మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం ల్యాబ్ నుంచి వచ్చిన ఆధారాలను సేకరించి నూర్ మహమ్మద్ ఎవరెవరితో చాటింగ్ చేశాడు... వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉండేవారు ఎంతమంది, ఎవరెవరిని ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపించాడు, వారి ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ నివేదికలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వారి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. ఎక్కువగా ఈ రెండు రాష్ట్రాల్లో ఉంటూ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వారితో నూర్ మహమ్మద్ చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారందరినీ అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, ముదిగుబ్బ సీఐ శివరాముడు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీసు బృందాలు శనివారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే నూర్ మహమ్మద్‌తో సంబంధాలున్న వారిని అరెస్టు చేసి ఇక్కడకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉగ్రలింకుల వేటలో జిల్లా పోలీసులు
నూర్ మహమ్మద్‌తో చాటింగ్ చేసిన వారికోసం గాలింపు
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో
కొనసాగుతున్న వేట