
రైలు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
ధర్మవరం అర్బన్: స్థానిక గాంధీనగర్ రైల్వేగేటు వద్ద రైలు ఢీకొని ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. టూ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని రాంనగర్‌లో నివాసముంటున్న వృద్ధురాలు వెంకటలక్ష్మికి కొంతకాలంగా మతిస్థిమితం సరిగాలేదు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె గాంధీనగర్ రైల్వేగేటు వద్ద పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొంది. ఘటనలో ఎగిరి పట్టాల పక్కన పడిన ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పింఛన్ ఇప్పిస్తానంటూ మోసం
రామగిరి: మండలంలోని పలు గ్రామాల్లో అర్హులైన వారికి పింఛన్ ఇప్పిస్తామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి డబ్బు వసూలు చేసిన విషయం సోమవారం వెలుగు చూసింది. బాధితులు తెలిపిన మేరకు... తనను తాను శివగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి కలెక్టరేట్ ఏఎస్‌ఓగా పనిచేస్తున్నట్లు నమ్మబలికాడు. మండలంలో పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆరా తీసి వారికి 94406 90029 నంబర్‌తో ఫోన్ చేసి మాట్లాడాడు. పింఛన్ మంజూరయ్యేలా చేస్తానంటూ ఒక్కొక్కరితో రూ.5 వేలు నుంచి రూ.10 వేల వరకూ అక్రమంగా వసూలు చేసి, ఆ తర్వాత ఫోన్ ఎత్తకుండా ముఖం చాటేశాడు. మొత్తం రూ.30 వేలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.
కదిరిలో కిడ్నాప్ కలకలం
కదిరి టౌన్: పట్టణంలో కిడ్నాప్ కలకలం రేపింది. సోమవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అడపాలవీధికి చెందిన వెంకటరమణమ్మ, ఆదినారాయణ దంపతుల కుమారుడు బాకు ప్రవీన్‌కుమార్‌కు ఐదేళ్ల క్రితం శ్రీకాళహస్తికి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థల కారణంగా గత కొన్నేళ్లుగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. మంజుల ప్రస్తుతం తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం మంజుల తరఫు బంధువులు రెండు వాహనాల్లో కదిరికి వచ్చారు. ప్రవీన్‌కుమార్, ఇంటి పనిమనిషి చైతన్య అనే మహిళపై దాడి చేసి కిడ్నాప్ చేశారు. అడ్డుకోబోయిన ప్రవీన్‌కుమార్ తల్లిదండ్రులను చెప్పులతో కొట్టి వెళ్లిపోయారు. ఈ మేరకు వెంకటరమణమ్మ ఫిర్యాదు మేరకు కోడలు మంజుల, ఆమె అన్న కంపా రాజేష్, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
ధర్మవరం రూరల్: రావులచెరువు వద్ద ఉన్న గంగమ్మ గుడి సమీపంలో సోమవారం రాత్రి పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ,4,900 నగదును స్వాఽధీనం చేసుకున్నామన్నారు.
చిన్నారిపై వీఽధి కుక్కల దాడి
గుంతకల్లు: స్థానిక బీఎస్‌ఎస్ కాలనీలోని మార్కేండేయ స్వామి ఆలయం వద్ద ఓ చిన్నారిపై వీధి కుక్కల మంద డాడి చేసింది. బీఎస్‌ఎస్ కాలనీకి చెందిన రామలక్ష్మి తన మూడేళ్ల వయసున్న కుమార్తె సుచిత్రను సోమవారం సాయంత్రం సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో వదిలేందుకు వెళుతుండగా ఒక్కసారిగా ఆరు కుక్కలు వీరిపై దాడి చేశాయి. సుచిత్రను రెండు కుక్కలు కరవడంతో నడుంపై రక్తగాయాలయ్యాయి. చిన్నారిని రామలక్ష్మి తన గుండెలకు హత్తుకున్నా కుక్కలు వీడలేదు. ఆ సమయంలో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని కుక్కలను తరిమేశారు. సుచిత్రను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
ప్రమాదంలో వ్యక్తి మృతి
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని నార్పల క్రాస్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నార్పలకు చెందిన శివస్రసాద్ (35) వ్యక్తిగత పనిపై సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. బీకేఎస్ శివారున నార్పల క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న ఆటో బోల్తాపడింది. ఆ సమయంలో వెనుకనే ఉన్న శివప్రసాద్ వేగాన్ని నియంత్రించుకోలేక బోల్తాపడిన ఆటోను ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే 108 అంబులెన్స్‌లో అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. చికిత్సకు స్పందించక మృతిచెందాడు. ఘటనపై బీకేఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్రాక్టర్ ఎక్కబోతూ...
పెద్దపప్పూరు: ట్రాక్టర్ ఎక్కబోతూ కాలు జారి కిందపడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... మండలంలోని నామనాంకపల్లికి చెందిన నారాయణమ్మ (70)కు ముగ్గురు సంతానం కాగా, చిన్న కుమారుడి వద్ద ఉంటూ వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తోంది. సోమవారం కూలి పని కోసం వెళ్లిన ఆమె సాయంత్రం వర్షం కురుస్తుండడంతో కూలీలందరితో కలసి ఇంటికి వెళ్లేందుకు ట్రాక్టర్ వద్దకు చేరుకుంది. ట్రాక్టర్ ఎక్కబోతుండగా కాలికి అయిన బురద కారణంగా జారి కిందపడింది. ఆ సమయంలో ఆయుపట్టుకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టిప్పర్ ఢీకొని...
తాడిపత్రి రూరల్: టిప్పర్ ఢీకొని ఓ ఆటో డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... యల్లనూరుకు చెందిన కుళ్లాయప్ప (38) ఉపాధి కోసం కుటుంబసభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వచ్చి షేర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆటోలో వెళుతుండగా చుక్కలూరు క్రాస్ వద్దకు చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ టిప్పర్‌తో సహా ఉడాయించాడు. అదే సమయంలో మరో ఆటోలో వెళుతున్న సోదరి కృష్ణవేణి గుర్తించి వెంటనే కుళ్లాయప్పను తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు.