
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి హత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు హత్యలు చోటు చేసుకున్నాయి. తల్లి పేరుపై ఉన్న ఇంటిని తన పేరుపై రాసివ్వలేదన్న అక్కసుతో కుమారుడు మద్యం మత్తులో చెలరేగిపోయాడు. కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన కదిరిలో చోటు చేసుకుంది. హిందూపురం మండలంలో కల్లు అంగడి వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
కదిరి టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని నిజాంవలీ కాలనీలో నివాసముంటున్న షేక్ ఖాసీంబీ (65) హత్యకు గురైంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కుమారుడే కత్తితో దారుణంగా పొడిచి హతమార్చాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఖాసీంబీ కుమారుడు బాబా ఫకృద్దీన్ అలియాస్ బాషా కొన్నేళ్ల క్రితమే ఇల్లు వదిలి శ్రీశైలం చేరుకుని అక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. తనకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద అమ్మాయికి పెళ్లి చేసిచ్చానని, రెండో కుమార్తె పెళ్లికి డబ్బు అవసరమైందని తల్లితో చెప్పుకున్నాడు. తల్లి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరుపై రాసివ్వాలంటూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో గొడవ పడిన అనంతరం బయటకు వెళ్లి మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే నిద్రిస్తున్న తల్లిపై కత్తితో దాడి చేసి, హతమార్చాడు. చుట్టుపక్కల వారు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.
హిందూపురం: మండలంలోని సంతేబిదనూర్ సమీపంలో కర్ణాటక వాసి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని గౌరీబిదనూరు పట్టణానికి చెందిన పవన్‌కుమార్ (26) రెండు రోజుల క్రితం హిందూపురం మండలం రాచేపల్లిలో బంధువుల ఇంట శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చాడు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమై కల్లు సేవించేందుకు సంతేబిదనూర్ సమీపంలో చెరువు వద్ద ఉన్న కల్లు అంగడికి చేరుకున్నాడు. అక్కడ ఘర్షణ చోటు చేసుకోవడంతో దుండగులు హతమార్చి గుర్తు పట్టేందుకు వీలులేకుండా పెట్రోలు పోసి నిప్పంటించారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో హిందూపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఆస్తి రాసివ్వలేదని కదిరిలో కన్నతల్లినే కత్తితో పొడిచి హతమార్చిన తనయుడు
కల్లు సేవించే సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలో కర్ణాటక వాసి హతం