
మంత్రులకు రైతుల గోడు పట్టదా?
రొద్దం: జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా రైతుల గోడు పట్టడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. శనివారం సాయంత్రం ఆమె తాడింగిపల్లిలో పర్యటించారు. మొక్కజోన్న రైతులను కలిసి.. పంట దిగుబడిపై ఆరా తీశారు. గతంలో క్వింటాలు మొక్కజొన్న రూ.2,500 నుంచి రూ.2800 దాకా ఉండేదని, ప్రస్తుతం ధరలు అమాంతంగా పతనమయ్యాయని రైతులు తెలిపారు. క్వింటాలు రూ.1,800 నుంచి రూ.1,900 మాత్రమే పలుకుతుండటంతో గిట్టుబాటు కావడం లేదన్నారు. గత ప్రభుత్వం మొక్కజొన్నను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరతో కొలుగోలు చేసి ఆదుకుందన్నారు. కూటమి ప్రభుత్వం అటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ మీడియాతో మాట్లాడుతూ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా మార్కెట్లో మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలేకపోవడం బాధాకరమన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం తాత్సారం చేయడంపై మండిపడ్డారు. దీంతో ధర నిర్ణయం దళారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందన్నారు. రొద్దం మండలంలో ఈ ఏడాది మొక్కజొన్న అధికంగా సాగు చేశారన్నారు. ధర లేకపోవటంలో కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న రాశులు వర్షాలకు తడుస్తున్నాయన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నా పలకరించే తీరిక మంత్రి సవితకు లేకపోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం మొక్కజొన్నకే కాదు ఉల్లి, చీనీ, దానిమ్మ తదితర ఏ పంటలకూ గిట్టుబాటు ధర కల్పించలేకపోయిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిమ్మయ్య నాగమ్మ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, నాయకులు ఎన్.నారాయణరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, సినిమా నారాయణ, అమీర్, స్థానిక నాయకులు హనుమంతరెడ్డి, నారాయణరెడ్డి, పెద్ద తిమ్మారెడ్డి, కుళ్లాయప్ప, మహ్మద్, అన్ని అనుబంధ కమిటీల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్