
రైతులను ముంచిన సొసైటీ సీఈఓ
చిలమత్తూరు: రైతులు వడ్డీతో సహా చెల్లించిన రుణానికి సంబంధించిన రూ.20 లక్షలను గుట్టుచప్పుడు కాకుండా కోడూరు సొసైటీ సీఈఓ కాజేసిన ఘటన వెలుగు చూసింది. నగదు చెల్లించి మూడు నెలలు కావస్తున్నా బ్యాంకులో నగదు జమ చేయకపోవడంతో రైతులు మార్టిగేజ్ చేసిన సర్వే నెంబర్లు వెబ్ ల్యాండ్‌లో లాక్‌లోనే ఉండిపోయాయి. దీంతో అనుమానం వచ్చిన రైతులు గోరంట్లలోని సొసైటీ బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. సీఈఓ రవీంద్రకుమార్ అలియాస్ కుమార్ రైతుల వద్ద నుంచి వసూలు చేసిన రూ.20 లక్షలకు సంబంధించిన సొసైటీ రసీదులను చూపించారు. అయితే ఆ మొత్తాన్ని సీఈఓ బ్యాంక్‌లో చెల్లించలేదని తెలుసుకుని సీఈఓ కుమార్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు. తాను సెలవులో ఉన్నానని, సోమవారం వచ్చి లాక్ తీస్తానని చెప్పి కట్ చేయడంతో ఆందోళనకు గురయ్యారు. ఇదే అంశంపై సొసైటీ బ్యాంకు ఇన్‌చార్జ్ మేనేజరు హరికృష్ణను వివరణ కోరగా.. రైతులు చెబితే కానీ తమకు ఈ విషయం తెలియలేదన్నారు. సీఈఓలే రైతుల వద్ద నగదు సేకరించి బ్యాంకుకు కడుతుంటారన్నారు. అయితే సంబంధిత రైతులకు సంబంధించి నగదు తమకు చేరలేదన్నారు. రైతులు చెల్లించిన సొమ్మును బ్యాంకుకు కట్టకపోవడం తప్పు అని, జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు.
మార్టిగేజ్ లోన్ క్లియర్ చేస్తానని రూ.20 లక్షలకు టోకరా