
‘వరం’లో జోరుగా కోడి పందేలు
● పోలీసుల రాకను గమనించి వాహనాలు వదిలి ఉడాయించిన జూదరులు
● 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గ్రామాల్లో కోడిపందేలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో విషయం పసిగట్టిన ధర్మవరం రూరల్ పీఎస్ ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఏలుకుంట్ల గ్రామ సమీపంలో కొండల మధ్య కోడి పందెం ఆడుతున్నట్లుగా గుర్తించి అక్కడకు చేరుకుంటుండగా అప్రమత్తమైన జూదరులు ఉడాయించారు. పోలీసులు వెంటాడి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, పారిపోయే క్రమంలో జూదరులు వదిలి వెళ్లిన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు. వాహన నంబర్ల ఆధారంగా జూదరులను గుర్తించి అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
వివాహిత బలవన్మరణం
ఓడీచెరువు (అమడగూరు): క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. అమడగూరు మండలం ఎం.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇడగొట్టు శ్రీనాథ్, గౌతమి (23) దంపతులు. వీరికి ఏడాది వయసున్న ఓ పాప, మూడేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గౌతమి ఉరి వేసుకుంది. విషయాన్ని గుర్తించిన వెంటనే కుటుంబసభ్యులు కిందకు దించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అమడగూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తపాలా పరీక్షకు విశేష స్పందన
అనంతపురం సిటీ: స్థానిక విశ్వభారతి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో స్థానిక తపాలా శాఖ అధికారులు ఆదివారం నిర్వహించిన దీన్ దయాళ్ స్పర్శ యోజన స్కాలర్‌షిప్ పరీక్షకు విశేష స్పందన లభించింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివే విద్యార్థులు మొత్తం 348 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 281 మంది హాజరయ్యారు. 67 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రక్రియను తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్‌నాథ్ పరిశీలించారు. పరీక్షలో ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

‘వరం’లో జోరుగా కోడి పందేలు