మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణతో దోపిడీ | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణతో దోపిడీ

Oct 13 2025 9:44 AM | Updated on Oct 13 2025 9:44 AM

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణతో దోపిడీ

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణతో దోపిడీ

రాప్తాడు రూరల్‌: వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో రూ.వేల కోట్ల దోపిడీకి సీఎం చంద్రబాబు తెరలేపారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం అనంతపురం రూరల్‌ మండలంలో చేపట్టారు. ఈ సందర్భంగా నగర శివారులోని బీజీఆర్‌ ఫంక్షన్‌లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను తీసుకొస్తే... నేడు వాటిని తన బినామీలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించాలనే ఉద్దేశంతో దివంగత వైఎస్‌ రాజశేఖరెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో రెండు అడుగులు ముందుకేసి రూ. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారన్నారు. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులను ఆధునీకరించారని, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశారని, ప్రతి ఇంటికీ ఫ్యామిలీ వైద్యుడిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పేదల ఆరోగ్యం విషయంలో జగనన్న ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ క్రమంలోనే పేదలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు, వారి పిల్లలు ఉచితంగా వైద్యవిద్య అభ్యసించేలా దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చారన్నారు. ఇందులో జగనన్న హయాంలోనే 5 కశాశాలలను నిర్మించి అడ్మిషన్లు మొదలు పెట్టి తరగతులు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగిలిన 12 మెడికల్‌ కళాశాలల్లో అడ్మిషన్లు వద్దంటూ కేంద్రానికి లేఖ చంద్రబాబు రాశారని, నిర్మాణాలు కూడా ఆపేయాలంటూ జీఓ ఇచ్చారన్నారు. తాజాగా వాటిని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం ముమ్మరం చేశారని మండిపడ్డారు. కొత్తగా వచ్చిన 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు పూర్తయితే కనీసం లక్షమందికి ఉపాధి లభించేదన్నారు. పైసా ఖర్చు లేకుండా ఏటా 5 వేలమంది వైద్యులయ్యే అవకాశాన్ని చిదిమేశారన్నారు.

పాపంపేట బాధితులకు అండగా ఉంటా

పాపంపేట బాధితులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా అండగా నిలిచానని ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన 20 ఇళ్లను కూల్చి వేసేందుకు పరిటాల సునీత చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. అడుగడుగునా ఆ ప్రయత్నాలను అడ్డుకున్నానన్నారు. అధికారం చేపట్టిన తర్వాత కలెక్టర్‌తో తనకు అనుకూలంగా సునీత లేఖ రాయించి రాత్రికి రాత్రి ఇళ్లను కూల్చివేశారన్నారు. మళ్లీ తానే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చానని, ఇప్పుడు మళ్లీ రాచూరి బంధువులతో పరిటాల సునీత బంధువులు జీపీఏ చేయించుకుని పాపంపేట పొలంలో ఎక్కడ ఖాళీ స్థలాలుంటే ఆక్కడ వాలిపోతున్నారన్నారు. పాపంపేట బాధితులకు అండగా నిలబడతానన్నారు. కబ్జాదారులు పాపంపేట వీధుల్లో కనిపించకుండా తరిమికొడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాప్తాడు ఎంపీపీ వరలక్ష్మి, వైస్‌ ఎంపీపీ కృష్ణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు బండి పవన్‌, దుగుమర్రి గోవిందరెడ్డి, నాయకులు భోగే గోపాల్‌రెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి, లోకనాథరెడ్డి, ఈశ్వరయ్య, అక్కంపల్లి మాధవరెడ్డి, ఆకుల మునిశంకరయ్య, వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పైసా ఖర్చు లేకుండా ఏటా 5 వేల మంది వైద్యులయ్యే అవకాశాన్ని చిదిమేశారు

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement