
భర్త ఇంటి ఎదుట వివాహిత ఆందోళన
సోమందేపల్లి: తనకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత తన భర్త ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలు.. సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలోని అంబేడ్కర్ కాలనీకు చెందిన హరీష్, మౌనిక ఏడాదిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తన శారీరక తీర్చుకుని ఆమెను గర్భవతిని చేసిన అనంతరం హరీష్ ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, ఐదు నెలల క్రితం స్థానిక సాయిబాబా ఆలయంలో పెళ్లి జరిపించారు. అనంతరం భర్త, అత్త, మామ తనను దూరంగా ఉంచుతూ తరచూ పుట్టింటికి పంపేవారు. దీంతో మరోసారి తనను మోసం చేసేందుకు భర్త, అత్తింటి వారు ప్రయత్నిస్తుండడంతో ఆదివారం మౌనిక తన భర్త ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టింది. ప్రస్తుతం 9వ నెల గర్భంతో ఉన్న తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.
అండగా ఉంటాం
మౌనికను వదిలించుకోవాలని చూస్తున్న భర్త హరీష్, అత్త, మామపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం మౌనికను ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలిసి మద్దతు పలికారు. చేస్తున్న ప్రయత్నం మంచిది కాదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న హితవు పలికారు. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వెంకటేష్, హనుమక్క, అలివేలమ్మ తదితరులు పాల్గొన్నారు.