
బలిగొన్న ఈత సరదా
బొమ్మనహాళ్: ఈత సరదా ఓ బాలుడిని బలిగొంది. బొమ్మనహాళ్ ఎస్‌హెచ్‌ఓ కమల్‌బాషా తెలిపిన మేరకు.. బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన రుద్రన్న, బసమ్మ దంపతుల కుమారుడు శివకుమార్ (16).. గోవిందవాడ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్నాడు. రెండవ శనివారం సెలవు కావడంతో తన స్నేహితులు ఆరుగురితో కలసి గ్రామ సమీపంలోని హగరి నదిలో ఉన్న కుంటలో ఈత కోసం వెళ్లాడు. అయితే శివకుమార్‌కు ఈత రాదు.. రెండు సార్లు మునిగిపోతుంగా స్నేహితులు వెలికి తీశారు. అయినా వినకుండా మూడో సారి కూడా నీటిలో దిగి గల్లంతయ్యాడు. సాయంత్రం వరకూ స్నేహితులు గాలించినా ఫలితం లేకపోయింది. విషయం పెద్దలకు తెలిస్తే తమను దండిస్తారనే భయంతో ఇంటికి చేరుకుని మిన్నకుండిపోయారు. రాత్రి అయిన శివకుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు తొలుత స్నేహితులను గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంటనే గజ ఈతగాళ్లను రంగంలో దించి శివకుమార్ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆదివారం ఉదయం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.