
ఆశావర్కర్లకు రూ.24 వేల వేతనమివ్వాలి
కదిరి టౌన్: ఆశా వర్కర్లకు కనీసం వేతనం రూ.24 వేలు ఇవ్వాలని కూటమి సర్కార్‌ను ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం కదిరిలోని కోనేరు సర్కిల్‌లో ఉన్న ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఆశా వర్కర్ల రెండవ జిల్లా మహాసభకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్‌తో కలసి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ఆశా వర్కర్లపై పని భారాన్ని తగ్గించాలన్నారు. ప్రభుత్వ సెలవులు, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. రికార్డులు సొంత డబ్బుతోనే కొనగోలు చేయాలనడం, సంబంధం లేని ఆన్‌లైన్ పనులన్నీ సొంత ఫోన్ ద్వారానే చేయాలని వేదించడం సరైంది కాదన్నారు. త్వరలో జరిగే రాష్ట్ర మహాసభలో ఆశా వర్కర్ల సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం 30 మందితో కూడిన జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షరాలిగా రాధమ్మ, ప్రధాన కార్యదర్శిగా సౌబాగ్య, కోశాధికారిగా రమాదేవి, సహాయ కార్యదర్శులుగా మమత, ముంతాజ్, చెన్నకృష్ణమ్మ, చంద్రకళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు త్రివేణి అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సాంబశివ, సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి