
దివ్యాంగులకు పింఛన్ కష్టాలు
పుట్టపర్తి అర్బన్: కూటమి ప్రభుత్వ అవగాహనా రాహిత్యం దివ్యాంగులకు తీరని కష్టాలు పెట్టింది. సదరం సర్టిఫికెట్ ఆధారంగా ఏళ్లుగా పింఛన్ పొందుతున్న దివ్యాంగులు మరోసారి పరీక్షించాలంటూ కూటమి సర్కార్ మూడు నెలల క్రితం శిబిరాలు నిర్వహించింది. అయితే వైద్యులు కనీసం పరీక్షించకుండానే ఇష్టానుసారం వైకల్య శాతం నమోదు చేశారు. ఇలా 40 శాతంలోపు వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ వచ్చినా చాలా మంది రీ అసెస్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ తాజాగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ కదిరి, మడకశిర, ధర్మవరం, హిందూపురం ఆసుపత్రుల్లో శుక్రవారం మొదలైంది. అయితే అధికారులు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు రెఫర్ చేయడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వారు వ్యయ ప్రయాసల కోర్చి రూ. వేలు ఖర్చు చేసుకుని పరీక్షలకు వెళ్తున్నారు.
రోజుకు 30 మందికే..
జిల్లాలో 5,204 మంది రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారికి శుక్రవారం నుంచి మడకశిర, ధర్మవరం, కదిరి ఏరియా ఆస్పత్రులతో పాటు హిందూపురం జిల్లా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హిందూపురంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ రీవెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రస్తుతం ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 30 మంది మాత్రమే పరీక్షిస్తారు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారందరినీ పరీక్షించాలంటే సుమారు 3 నెలల సమయం పడుతుందని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు పరీక్షలు పూర్తయి వైకల్య శాతం సర్టిఫికెట్ వచ్చే వరకూ పెన్షన్ అందిస్తామంటున్నారు.
జిల్లాలో ప్రారంభమైన పునః పరిశీలన
5,204 మందిని పరీక్షించనున్న వైద్యులు
సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు
కేటాయించడంతో ఇబ్బందులు