
రీ సర్వేపనుల్లో అలసత్వాన్ని సహించం
● జేసీ అభిషేక్ కుమార్ హెచ్చరిక
ప్రశాంతి నిలయం: రీ సర్వే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని, సంబంధిత అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాలులో సర్వే శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రీసర్వే అంశాలపై సమీక్షించారు. ఫేజ్–2 రీసర్వే, ఎఫ్‌పీఓఎల్‌ఆర్ పనులను గడువులోపు పూర్తి చేయాలని, ఫేజ్–3 రీసర్వేకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల మేరకు కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. రీ సర్వేలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా సంబంధిత అధికారులు పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, లాండ్, సర్వే అధికారిని విజయశాంతి బాయి, సర్వే శాఖ డీఏఓలు, డీఐఓలు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
తాగునీటి కోసం నిరసన
కదిరి అర్బన్: తమకు తాగునీరు అందించాలంటూ కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హమాలీ కాలనీకి చెందిన పలువురు మహిళలు గురువారం స్థానిక సచివాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమానికి సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. స్పందించిన అధికారులు కాలనీకి రెండు నీటి ట్యాంకర్లను పంపి.. శుక్రవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాంబశివ, నారాయణ, దివాకర్‌నాయక్, కాంతమ్మ, భారతి, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.
యువకుడి దుర్మరణం
రాప్తాడు: టిప్పర్ కిందపడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని రుద్రంపేటలో నివాసముంటున్న చిట్రా వరప్రసాద్ (41), బంగారు నాగరత్న దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శారీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చిట్రా వరప్రసాద్ గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై రాప్తాడు మండలం హంపాపురంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడా పని ముగించుకుని రుద్రంపేటకు తిరుగు ప్రయాణమైన ఆయన హంపాపురం క్రాస్‌లో 44వ జాతీయ రహదారిని దాటుతుండగా అనంతపురం వైపుగా వెళుతున్న టిప్పర్ వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో చిట్రా వరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యాడికిలో వరుస చోరీలు
యాడికి: మండల కేంద్రంలోని ఐదు ఇళ్లలో వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. బుధవారం రాత్రి ఇద్దరు దుండగులు నెత్తికి రుమాలు చుట్టుకుని తాళం వేసిన గృహాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. కమ్మవీధిలోని వద్ది కృష్ణమూర్తి ఇంట్లో 50 తులాల వెండి, తమ్మినేటి రాజగోపాల్ నాయుడు ఇంట్లో రూ.4వేల నగదు, వెండి దీపాలు, కలశం, శాంతి నగర్‌లోని ఓబయ్య కుమారుడు పోతురాజు రాజయ్య ఇంట్లో రూ.37వేల నగదు, ఒక తులం బంగారు చైను, ఒక జత వెండి కాళ్ల పట్టీలు, సుమయాన్ ఇంట్లో రూ.10వేల నగదు, 2 తులాల బంగారం, కోన రోడ్డులోని కోటేష్ కుమారుడు గంగవరం శివ ఇంట్లో వెండి కాళ్ల పట్టీలు, వెండి మొలతాడును అపహరించారు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన 5 ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.

రీ సర్వేపనుల్లో అలసత్వాన్ని సహించం