
కల్తీ మద్యంతో సంపద సృష్టినా?
● మడకశిర వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త ఈరలక్కప్ప
మడకశిర: సంపద సృష్టి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమని, అయితే ఇందుకు భిన్నంగా కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చడం కాదని కూటమి ప్రభుత్వంపై మడకశిర వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు టీడీపీ ఇన్‌చార్జ్ కల్తీ మద్యం తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదన్నారు. మద్యం షాపుల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి కల్తీ మద్యం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. మడకశిర నియోజకవర్గంలో బెల్ట్‌షాపులను అరికట్టాలన్నారు.
సస్యరక్షణతో
మెరుగైన దిగుబడులు
● ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రామసుబ్బయ్య
పుట్టపర్తి అర్బన్: తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే మేలైన పంట దిగుబడులు సాధించవచ్చని ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రామసుబ్బయ్య పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి వ్యవసాయ కార్యాలయంలో పంట దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించారు. ఖరీప్‌లో సాగు చేసిన వేరుశనగ ప్రస్తుతం అభివృధ్ది దశలో ఉందన్నారు. ఇలాంటి తరుణంలో మచ్చ తెగులు వ్యాపించే ప్రమాదముందన్నారు. నివారణకు లీటరు నీటికి ఎక్సాకొనజోల్ 2 ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. కంది పంట ప్రస్తుతం 60 రోజులు కావస్తోందని లీటరు నీటికి కలిపి ప్రొఫెనోపాస్ 2 ఎంఎల్ లేదా ఓమైట్ 1 ఎంఎల్ పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్న పంట కంకి దశ నుంచి విత్తనం అభివృధ్ది దశకు చేరుకుందన్నారు. 60 రోజుల దశలో యూరియా 50 కిలోలు, 25 కిలోల పొటాష్ ఎరువులు వాడాలన్నారు. వరి పిలకల దశలో ఉందని ఎకరాకు యూరియా 50 కిలోలు వాడాలన్నారు. నల్లి తెగులు నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోపాస్ 2 ఎంఎల్, ఓమైట్ ఒక ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్‌నాయక్, రైతులు పాల్గొన్నారు.
విద్యార్థిని ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి: మండలంలోని ప్యాదిండికి చెందిన గంగాధర్ కుమార్తె అశ్విని (16) ఆత్మమత్య చేసుకుంది. రామగిరిలోని కేజీబీవీలో ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న అశ్విని ఇటీవల దసరా సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చింది. బుధవారం కళాశాలకు వెళ్లాల్సి ఉండగా మంగళవారం రాత్రే తల్లిదండ్రులు ఆమెకు అవసరమైన దుస్తులు, పుస్తకాలను సర్ది పెట్టి ఇచ్చారు. బుధవారం తెల్లవారుజామున అశ్వినిని తల్లి పార్వతమ్మ నిద్రలేపి త్వరగా రెడీ కావాలని చెప్పి ఇంటి పనిలో నిమగ్నమైంది. అయితే కాలేజీకి వెళ్లడం ఇష్టం లేని అశ్విని... నేరుగా ఇంటి పక్కనే ఉన్న పశువుల పాకలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అశ్విని కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. పశువుల పాకలో ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి ఆగమేఘాలపై ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కడుపు నొప్పి తాళలేక...
పరిగి: మండలంలోని కాలువపల్లికి చెందిన కురుబ గంగాధరప్ప భార్య శివగంగమ్మ(50) ఆత్మహత్య చేసుకుంది. కొన్నేళ్ల క్రితమే గంగాధరప్ప మృతి చెందాడు. కుమారుడు లోకేష్ వృత్తి రీత్యా హైదరాబాదులో ఉంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న శివగంగమ్మ పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంది. అయినా నయం కాకపోవడంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు రాత్రి ఫోన్ చేస్తున్నా తల్లి స్పందించకపోవడంతో సమీప బంధువుకు కుమారుడు లోకేష్ ఫోన్ చేసి విషయం తెలిపాడు. దీంతో బంధవు ఇంటి వద్దకెళ్లి పరిశీలించడంతో ఆత్మహత్య విషయం వెలుగుచూసింది. అనారోగ్యం కారణంతోనే తన తల్లి ఆత్మహత్య చేసుకుందంటూ లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మోరీని ఢీకొన్న కారు..
వ్యక్తి మృతి
పావగడ: స్థానిక పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. మడకశిర మండలం రేకులకుంట గ్రామానికి చెందిన నరసింహమూర్తికి పావగడ తాలూకా కడపలచెరువు గ్రామానికి చెందిన మణితో వివాహమైంది. ఈ క్రమంలో పుట్టింటికి వచ్చిన భార్యను చూసేందుకు బుధవారం తన స్నేహితుడు గోపాల్ (56)తో కలసి కారులో కడపల చెరువుకు వచ్చాడు. సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. తుమకూరు రోడ్డులోని కణివేనహళ్లి గేట్ వద్దకు చేరుకోగానే కారు నడుపుతున్న నరసింహమూర్తి నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మోరీని ఢీకొంది. ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నరసింహమూర్తిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, గోపాల్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

కల్తీ మద్యంతో సంపద సృష్టినా?

కల్తీ మద్యంతో సంపద సృష్టినా?